48 ఏళ్లుగా బస్సే లేని గ్రామం.. ఎట్టకేలకు ఊర్లోకి ఎర్రబస్సు..
జానాలగూడెం (నంద్యాల) : డిజిటల్ విప్లవం పరుగులుతీస్తున్న ఈ ఆధుని కాలంలోనూ ఇంకా సరైన రోడ్లు, కరెంటు, రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. మా ఊరికి కరెంటొస్తే... నీరొస్తే ... రోడ్డేస్తే... బస్సొస్తే బాగుండు అనుకునే ఎన్నో గ్రామాలున్నాయి. అలాంటివాటిలో ఆత్మకూరు సమీపంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం ఒకటి. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా ... ఏకంగా 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ... ఆ గ్రామస్థుల కళ్లలో వెలుగులు నింపుతూ మొదటిసారి ఆర్టీసీ బస్సు శబ్దం చేస్తూ ఆ ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టింది. అంతే ..! గ్రామస్తులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఆ బస్సుకు పూజలు చేసి నమస్కరించారు..!
8 కిలోమీటర్ల నడక ..!
ఈ నాలుగున్నర పదుల కాలంలో ఆ గ్రామ ప్రజలు పడిన కష్టాలు వర్ణనాతీతం. అత్యవసర వైద్యం కావాలన్నా, పిల్లల ఉన్నత చదువులకైనా ఆ గ్రామస్థులకు నడక ఒక్కటే శరణ్యమైంది. దాదాపు 8 కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పల బాటలో కాలినడకన వెళ్తే తప్ప సమీప పట్టణానికి చేరుకోలేని పరిస్థితి. రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సులు పరుగులు తీస్తున్నా ... జానాలగూడెం వాసులకు మాత్రం అసలు బస్సే లేక ఆటోలకు వేల రూపాయలు వెచ్చించలేక నరకయాతన అనుభవించేవారు.
ప్రజాప్రతినిధుల చొరవ.. కదిలొచ్చిన ‘ఎర్రబస్సు’
గ్రామస్తుల దశాబ్దాల కష్టాలను, రవాణా లేమి వల్ల పడుతున్న ఇబ్బందులను ప్రజా ప్రతినిధులు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంటు ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక రూట్‌ను మంజూరు చేయించారు. అధికారుల వేగవంతమైన చర్యలతో గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరించబడటంతో, ఊరి శ్రేయస్సును కోరే ఆశలు చిగురించాయి.
ఊరంతా పండగ వాతావరణం.. బస్సుకు గ్రాండ్ వెల్‌కమ్ !
ఆదివారం గ్రామంలోకి ఆర్టీసీ బస్సు అడుగుపెట్టిన క్షణం జానాలగూడెంలో ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తలపించింది. మునుపెన్నడూ లేని విధంగా గ్రామస్థులు, మహిళలు, విద్యార్థులు డప్పు వాయిద్యాలను వాయిస్తూ ఆర్టీసీ బస్సుకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, బస్సుకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు, ఊరి సమగ్ర అభివృద్ధికి ఈ ‘ఎర్రబస్సు’ ఓ కొత్త మార్గం సుగమం చేస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)