మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాగుకు సవాలే..!

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఎంకు నివేదించిన అధికారులు

  • ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎల్‌‌నినో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగంపై పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద ప్రణాళిక శాఖపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. వాస్తవ పరిస్థితులను సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో 258.3 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 124.4 మి.మీ. మాత్రమే నమోదైందని, జులైలో పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. దీంతో జూన్‌లో 25.2 శాతంగా ఉన్న లోటు జూలైలో 67.9 శాతానికి చేరిపోయింది. ఈ పరిస్థితులు వ్యవసాయాన్ని క్లిష్టంగా మారుస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా వర్షాభావం కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం ఎక్కువగా ఉందని, జులై 20 నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు సుమారు 28 శాతం ఉండగా, రాష్ట్రంలో ఏకంగా 51.8 శాతంగా నమోదైందని తెలిపారు. అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం

ఆగస్టు 5 నాటికి రాష్ట్రంలో మొత్తం పంటల విస్తీర్ణం 15.16 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ తేదీకి సాధారణంగా జరగాల్సిన సాగులో ఇది కేవలం 81 శాతం మాత్రమే. మొత్తం సీజన్ లక్ష్యంతో పోలిస్తే ఇప్పటివరకు 49 శాతం మాత్రమే సాగైంది. ఆహార ధాన్యాల సాగు సాధారణ స్థాయిలో 86 శాతానికి చేరినా నూనెగింజల సాగు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటూ కేవలం 40 శాతానికే పరిమితమైనట్టు తేలింది.

వేరుశనగ రైతులకు వర్షాభావం దెబ్బ

రాష్ట్రంలో వర్షాధార పంటల్లో కీలకమైన వేరుశనగ సాగు కేవలం 35 శాతమే నమోదైంది. తేమ పరిస్థితి లేకపోవడం, పొలాల్లో పనులు ఆలస్యం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. జొన్న, చిరుధాన్యాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటల్లోనూ గణనీయమైన సాగు లోటు నమోదైంది. పత్తి సాగు మాత్రం సాధారణ స్థాయిని మించి 113 శాతానికి చేరింది. దీంతో అన్ని పంటలపై వర్షాభావ ప్రభావం ఒకేలా లేదని స్పష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఆహార భద్రతకు సంబంధించి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 533.36 లక్షల టన్నుల వరి, రబీ మార్కెటింగ్ సీజన్‌లో 349.92 లక్షల టన్నుల గోధుమ అందుబాటులో ఉన్నట్టు చెబుతున్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ వర్షాభావం ఇలాగే కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తితో పాటు జలాశయాలు, భూగర్భ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. పంట దిగుబడులు తగ్గితే రైతుల ఆదాయాలు తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ పరిస్థితి బలహీనపడవ చ్చునని భావిస్తున్నారు. వస్తువులు, వ్యవసాయ ఇన్‌పుట్ల కొనుగోళ్లపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గిన రైతులు సాగు ఖర్చుల కోసం సంస్థాగత రుణాలపై మరింత ఆధారపడే పరిస్థితి ఉంటుందని, దీంతో వర్షాభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా గ్రామీణ వినియోగం, రుణ డిమాండ్, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

​ఆగస్టు వర్షాలపైనే ఆశలు

​ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆగస్టు వర్షాలే కీలకం. ఆగస్టులో రుతుపవనాలు బలపడి తగినంత వర్షపాతం నమోదైతే ఆలస్యంగా అయినా కొన్ని పంటల సాగు పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే వర్షాభావం కొనసాగితే పంటల ఉత్పత్తి, రైతుల ఆదాయం, గ్రామీణ వినియోగం తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం మరింత స్పష్టమయ్యే ప్రమాదం ఉంది.

table

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్