చట్టాల్లోని లొసుగులతో విచ్చలవిడిగా గిరిజనుల భూములు కబ్జా
ప్రభుత్వ భూములనూ దిగమింగేశారు
• పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉమ్మడి జిల్లా అనంతగిరి మండల పరిధి కాశీపట్నం కొండల్లో కార్పొరేట్లు తిష్టవేసి గిరిజనుల భూములను చాపచుట్టేస్తున్నారు. చట్టాలలోని లొసుగులతో పాటు, గిరిజనుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని విచ్చలవిడిగా ఈ భూ దోపిడి కొనసాగిస్తున్నారు. కొండలపైన గుడి కడతామంటూ ప్రారంభమైన దందా ఆ తరువాత పర్యాటక రంగ అభివృద్ధి, రిసార్టులంటూ వేయితలలు వేస్తోంది. గిరిజనుల అవాస ప్రాంతమైన ఏజెన్సీ కొండలలో కార్పొరేట్ ప్రాబల్యం ఎలా పెరుగుతుందో అర్ధం చేసుకోఇడానికి కాశీపట్నం నుంచి పైకి 18 కిలోమీటర్ల ఎత్తయిన పర్వత శ్రేణులను ఒక్కసారి పరిశీలిస్తే చాలు! చట్టాలు కార్పొరేట్లకు చుట్టాలుగా ఎలా మారుతాయో, అధికారం కళ్లు ఎలా మూతపడతాయో ఇట్టే అర్ధమవుతుంది. ఏళ్ల తరబడి విచ్చలవిడిగా సాగుతున్న ఈ భూ లూటీకి ‘మా హయంలో ప్రారంభం కాలేదు. ఎప్పటి నుండో ఇది కొనసాగుతోంది.’ అంటూ తప్పించుకుతిరిగే అధికారయంత్రాంగపు మాటే నిలువెత్తు సాక్ష్యం! రెవిన్యూ, అటవీశాఖల నిర్లక్ష్యం ఫలితంగా తరతరాలుగా గిరిజనులు నివసించే గ్రామాలు సైతం కార్పొరేట్ కబ్జాలో విలవిలలాడుతున్నాయి!
వెంకన్న సాక్షిగా....!
విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట-అరకు రోడ్డులో అనంతగిరి మండలంలో కాశీపట్నం (రోడ్డుపైనే) ఉంటుంది. ఇక్కడ నుంచి కుడివైపు ఉన్న ఎత్తయిన కొండల్లో 25 గిరిజన గ్రామాలు ఉన్నాయి. కాశీపట్నం నుంచి కొండలపైకి ఎక్కుతున్న క్రమంలో ఎత్తయిన ఘాట్ రోడ్డు 80 మలుపులతో ఉంది. కింద నుంచి 3,405 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు! ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే దృశ్యాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. దీంతో ఈ ప్రాంతంపై కార్పొరేట్ల కన్నుపడింది. 2014లో ఇక్కడ వెంకటేశ్వరుని గుడి నిర్మించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం డికెపర్తి (కొండపై గ్రామం)లో ఈ గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకు చూస్తే తాటి పూడి రిజర్వాయర్ అత్యంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే ఇది షెడ్యూల్ ప్రాంతం కాదు. నాన్‌షెడ్యూల్ ఏరియా కావడంతో దీనిని అవకాశం గా తీసుకున్నారు. గుడి కట్టిన తరువాత వెంకన్న సాక్షిగా తమ భూ కబ్జాను విస్తరించారు. నయానా, భయానా గిరిజనులను లొంగదీసుకు న్నారు. అతి తక్కువ ధరకు వారి నుండి భూముల ను కొన్నారు. బెదిరించి స్వాధీనం చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. పనిలో పనిగా ప్రభుత్వ భూమినీ దిగమింగేశారు! దీంతో తరతరాలుగా గిరిజనుల ఆధీనంలో ఉన్న భూమి రియల్ ఎస్టేట్, కార్పొరేట్ల పాలైంది. తొలుత అతి తక్కువ ధరకు కొద్ది కొద్దిగా భూములు కొనడం మొదలుపెట్టారు. కొంతమంది గిరిజనులను బెదిరించి సాగుభూములను స్వాధీనం చేసుకున్నారు. గిరిజనులకు అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం చట్టాలను ఉటంకిస్తూ కార్పొరేట్లకు వంత పలికింది. ఫలితంగా తర తరాలుగా బతుకులీడ్చిన ప్రాంతాల్లోనే సెంటు భూమి లేని స్థితికి గిరిజనులు చేరుకున్నారు.
కార్పొరేట్ల కబ్జా ఇలా...
నిజానికి ఈ ప్రాంతంపై ఎప్పటి నుండో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుంది. 2003లో సినిమా రంగానికి చెందిప ఒక ప్రముఖ నిర్మాత కుటుంబం, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఇక్కడి భూములను కొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. క్రమేణా మరికొందరు కూడా ప్రవేశించారు. 2009 తర్వాత నెమ్మదిగా పనులు రోడ్డు, మౌలిక వసతులను మొదలుపెట్టారు. ఈ కొండలపై సుమారు 25కు పైగా గ్రామాలుండగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ గిరిపుత్రులే అధికం. వారి నుండి భూములను కారుచౌకగా కొనేసి రిసార్టులు, పర్యాటకం అభివృద్ధి పేరుతో కాశీపట్నం కొండలను ఆక్రమించారు. ఎన్‌ఆర్‌పురం పంచాయతీలో నాలుగు రెవెన్యూ గ్రామాలు వైఎస్ ఆర్ పురం, బొంకింత, పెదకోనెల, కోటపర్తి ఉన్నాయి. వీటన్నిట్లోనూ గిరిజన భూములున్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎన్‌ఆర్‌పురం దగ్గర వెంచర్లు వేసి ఇప్పటికే 340 ఎకరాలు అమ్మేశారు. మరో 20 ఎకరాల వెంచర్‌ను తాజాగా సిద్ధం చేసుకుంటున్నారు. 2003 తొలినాళ్లలో ఎకరా భూమి రూ.లక్షన్నరకు కొని సెంటును రూ.3లక్షలకు ప్లాట్లుగా సెంట్ల రూపంలో వెంచర్లు వేసి అమ్మేశారు. రెండోసారి 2009 తర్వాత ఎకరా భూమిని రూ.3లక్షలకు కొన్నారు. తొలుత 275 ఎకరాలను మాత్రమే ఈ రకంగా కొని మరో 400 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించినట్లు చెబుతున్నారు.
1/70 చట్టం అమల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాలోనే గిరిజనేతరులకు భూముల బదిలీలపై నిషేధం ఉంది. అక్కడ కూడా నకిలీ పత్రాలు, బినామీ పేర్లతో స్వాహా చేసేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ర్టార్ ఆఫీసు, విజయనగరం రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ భూముల రిజిస్ట్రేషన్ ప్రకియ గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు : అనంతగిరి తహశీల్దార్ వీరభద్రాచారి
కాశీపట్నం కొండలలో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అనంతగిరి తహశీల్దార్ వీరభద్రాచారి చెప్పారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ కొండపై ఫారెస్టు పరిధిలోకి వచ్చే గ్రామాలు అనేకం ఉన్నాయని చెప్పారు. అవి కాకుండా నాలుగు రెవెన్యూ గ్రామాలున్నాయని అక్కడ
. 1/70 చట్టం వర్తించదని చెప్పారు. దీంతో బయట నుంచి వ్యక్తులు వచ్చి కొని మళ్లీ బయట వాళ్లకే అమ్ముతున్నారని, ఇది ఎప్పటి నుండో జరుగుతోందని అన్నారు. తాము ప్రస్తుతం రీ సర్వే చేస్తున్నామని, రెవెన్యూ, అటవీభూమి కాకుండా గ్యాప్ ఏరియాలో భూములు ఉంటే స్వాధీనం చేసుకుంటాం. ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.







కామెంట్‌లు (0)