రాష్ర్టంలో కార్పొరేట్, ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా పాలన
‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో భూములు లాక్కొంటున్న చంద్రబాబు సర్కారు
రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ర్టంలో కార్పొరేట్, ల్యాండ్ మాఫియా శక్తులు నిలువు దోపిడీ చేస్తున్నాయని, కార్పొరేట్లను పోషించడానికి పాత పిపిపి విధానం సరిపోవట్లేదని చంద్రబాబు ప్రభుత్వం కొత్త పిపిపి విధానం తెచ్చిందని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖలోని ఏచూరి భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడులతో కలసి మీడియాతో మాట్లాడారు. కొత్త పిపిపి విధానంలో వయబిలిటీ గ్యాప్ పేరుతో బడా కార్పొరేట్లకు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే రూ.1,500 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులను ఆదుకోవడానికి, విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించడానికి డబ్బులేదంటున్న ప్రభుత్వం... పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టీల్‌ప్లాంట్‌లో గ్యాస్ ఉత్పత్తికి రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని ఈ ఏడాది మార్చిలో కోరిన కార్మిక సంఘాల ప్రతినిధులకు రూ.8 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ హామీ ఇచ్చి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు ఆగమేఘాలపై రూ.22 వేల కోట్లు రాయితీలను రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించడం, రాత్రికి రాత్రే జిఒలు తేవడం, స్థానికులకు ఉపాధి కల్పనపై ఎలాంటి గ్యారెంటీ తీసుకోకపోవడం పట్ల తీవ్రంగా ఆక్షేపించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రజా వనరులైన నీరు, భూములు, విద్యుత్ సర్వస్వం దోచిపెట్టేందుకు కొత్త పిపిపి విధానం తెచ్చి ప్రజల నెత్తిన రుద్దుతున్నారన్నారు. వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీలేని రుణాలను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ, ప్రజల సొమ్మును దోచిపెట్టే ప్రభుత్వ కార్పొరేట్ లూటీకి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున పోరాడాలని కోరారు. రాష్ర్టంలో కార్పొరేట్లు రూ.లక్ష కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టారన్నారు. ఈ డబ్బులు వసూలు చేయకుండా వడ్డీలు, జిఎస్‌టిలను ప్రభుత్వం మాఫీ చేస్తోందని, కార్పొరేట్లకు అల్లుడ్ని మించిన అతిథి మర్యాదలు చేసి రాష్ర్ట ప్రజల సొమ్మును దోచిపెడుతోందని వివరించారు. రాష్ర్టమంతా విశాఖలోని ఆరిలోవ వైపు చూస్తోందని, తాగునీరు లేక ఇక్కడి ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దారుణమన్నారు. గూగుల్ డేటా సెంటర్‌తో తాగు నీటి సమస్య మరింత పెరగనుందని, అదానీకి నీరిచ్చే విధానంపై ప్రభుత్వం పున:పరిశీలన చేయాలని, ప్రజల ఆందోళనపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టే ప్రచారం చేస్తోందన్నారు. ఈ రెండేళ్లలో మెగా డిఎస్‌సి ద్వారా 15 వేలు, పోలీస్ ఉద్యోగాలు ఆరు వేలు ఇచ్చినట్లు చెప్పినా మొత్తంగా ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వెలిగొండ నిర్వాసితులను బలవంతంగా వెళ్లగొట్టాలని ప్రభుత్వం చూస్తోంది
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు, పునరావాసానికి రూ.300 కోట్లు చెల్లించి బలవంతంగా వెళ్లిపోవాలంటూ నిర్వాసితులపై అధికారుల ద్వారా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ‘మీ భూమి-మీహక్కు’ అని ప్రచారం చేస్తూ ‘మీ భూమి-మా హక్కు’ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రైతుల భూమి లాక్కొనే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. తాజాగా తెరపైకి ఫ్రీ హోల్డ్ పేరు తెచ్చి భూ మాఫియా అక్రమ కొనుగోలు, దురాక్రమణలను ప్రభుత్వమే చట్టబద్ధం చేయబోతోందని స్పష్టమవుతోందన్నారు. పేదల భూములు 22 'ఎ`లో ఉంటే వాటిలో ఎన్ని బయటకు తీసి రక్షణ కల్పించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గతంలో వేసిన సిట్ నివేదికలను బయటకు తీసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)