- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాయవ్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది.
సోమవారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారంనాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.








కామెంట్‌లు (0)