గత అప్పులపై అపరాధ రుసుం, వడ్డీ భారం
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : మండల కేంద్రమైన కోడూరుకు చెందిన రేపల్లె యోగ ప్రకాష్ (రాము)కు కోడూరు రెవెన్యూ గ్రామంలో 2.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్)లో గతేడాది లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్నారు. ఈ భూములు 22 ‘ఎ’ జాబితాలో ఉండడంతో ఈ ఏడాది రుణాలు ఇవ్వడం లేదని తెలియడంతో ఆయన ఏడు శాతం చొప్పున వడ్డీ చెల్లించారు. రుణం రీ షెడ్యూల్ కాకపోవడంతో ఇకపై 13 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఒక్క రైతు మాత్రమే కాదు... ఈ పిఎసిఎస్ పరిధిలోని కోడూరు, రామకృష్ణాపురంలో మొత్తం 320 మంది రైతుల పంట రుణాలు రీ షెడ్యూల్ కాలేదు. వీరందరిపైనా 13 శాతం వడ్డీ భారం పడుతుంది. పూర్తిగా చెల్లించిన రైతులకు కూడా తిరిగి రుణం ఇవ్వలేదు. ఈ పిఎసిఎస్ పరిధిలోని రామకృష్ణాపురంలో 9,700 ఎకరాలు అనాధీనం 22 ఎ (సి) జాబితాలో ప్రభుత్వం గతంలో చేర్చింది. సమస్య పరిష్కారానికి రైతులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా ఉంది.
పాలకుల తప్పిదానికి రైతులు మూల్యం
పాలకుల తప్పిదానికి రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 22 ‘ఎ’ బాధిత రైతులకు కృష్ణా జిల్లాలో పిఎసిఎస్‌లు, వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది నుంచి పంట రుణాలు నిలిపివేశాయి. దీంతో, రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల జాబితా చేర్చుతూ 2016 మే ఐదున అప్పటి టిడిపి ప్రభుత్వం జిఒ నంబర్ 216 విడుదల చేసింది. కృష్ణా జిల్లాలో 30 వేల ఎకరాలకుపైగా ఈ జాబితాలో చేర్చింది. కోడూరు, నాగాయలంక మండలాల్లో అత్యధికంగా 29 వేల ఎకరాల ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూముల జాబితాలో చేరాయి. మచిలీపట్నం, కృత్తివెన్ను తదితర తీర ప్రాంత మండలాల్లోనూ 1,200 ఎకరాల భూములను ఈ జాబితాలో చేర్చారు. రైతుల వద్ద ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లు, పాత పాస్‌బుక్‌ల ఆధారంగా ఈ భూములకు పిఎసిఎస్‌లు, వాణిజ్య బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పంట రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాదితో ఛార్జి డిక్లరేషన్ గడువు ముగిసిపోయిందని పేర్కొంటూ 22 ‘ఎ’ జాబితాలోని భూములకు రిజిస్ర్టేషన్ కార్యాలయంలో తిరిగి ఛార్జి డిక్లరేషన్ చేయడానికి అనుమతించలేదు. దీంతో, సదరు భూములపై పంట రుణాలను ఇవ్వొద్దని, రెన్యూవల్ చేయవద్దని పేర్కొంటూ కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (కెడిసిసి) అధికారులు పిఎసిఎస్‌లకు మెమో జారీ చేశారు. గతేడాది రుణం తీసుకుని పూర్తిగా చెల్లించిన వారికి కూడా ఈ సీజన్లో పంట రుణాలు నిలిచిపోయాయి. రుణాలు తిరిగి ఇవ్వకుంటే పంటల సాగుకు పెట్టుబడి పెట్టడం ఇబ్బంది అవుతుందని కొందరు రైతులు రుణ రెన్యూవల్ కోసం పంట రుణాల వడ్డీ మాత్రమే చెల్లించారు. పూర్తి స్థాయిలో రుణం చెల్లించలేదనే పేరుతో అపరాధ రుసుం భారం మోపుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఏడు శాతం వడ్డీతో పంట రుణాలు బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మూడు శాతం రాయితీని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. వడ్డీ మాత్రమే చెల్లించిన రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తుంటారు. వీరికి ప్రభుత్వ రాయితీ మూడు శాతం వడ్డీ జమకాదు. రీషెడ్యూల్ చేసి ఏడు శాతం వడ్డీ తీసుకుంటారు. రీ షెడ్యూల్‌కు సైతం అవకాశం ఇవ్వకపోడంతో ప్రస్తుతం వీరు 13 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
2024లో భూముల రీ సర్వే తర్వాత కృత్తివెన్ను మండలం గరిశపూడి గ్రామంలోని 46/ఎ, 47/ఎ సర్వే నెంబర్లలోని 11 ఎకరాల చేపల చెరువు భూములను 22 ‘ఎ’ జాబితాలో చేర్చారు. ఈ భూములకు సంబంధించిన ఎన్.రాంబాబు, సుధీర్ కుమార్, ఇంటూరి ఆదినారాయణలకు స్థానికంగా ఉన్న కమర్షియల్ బ్యాంకు రుణం మంజూరు తాజాగా నిలిపివేసింది. 1949 నుంచి రికార్డులు ఉన్న తమ భూములను 22 ‘ఎ’ జాబితాలో చేర్చడంతో బ్యాంకు రుణం పొందలేకపోతున్నామని, అవసరాలకు ప్రయివేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు చెయ్యాల్సి వస్తోందని, దీనిపై ప్రతి ఈ నెల 17న పిజిఆర్‌ఎస్ (గీవెన్స్)లో వినతిప్రతం ఇచ్చినా ఫలితం లేకుండా ఉందని వారు వాపోతున్నారు. రికార్డులన్నీ పక్కాగా ఉన్నా తమ భూములపై కనీసం పంట రుణం తీసుకోలేకపోతున్నామని, కుటుంబ అవసరాలకు అమ్ముకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. అక్రమంగా 22 ‘ఎ’ జాబితాలో చేర్చిన భూములను ఆ జాబితా నుంచి తొలగించి తమకు పంట రుణాలను యథావిధిగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)