- వెలిగొండ నిర్వాసిత యువత రిలే దీక్షలు ప్రారంభం...
ప్రజాశక్తి-మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టును సెప్టెంబర్ ఒకటిన జాతికి అంకితం చేసే నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన యువతీయువకులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను నిర్వాసిత సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య ప్రారంభించి మాట్లాడారు. ప్రాజెక్టు జాతికి అంకితం చేసే నాటికి 18 సంవత్సరాలు వయసు కలిగి, కుటుంబంగా ఏర్పడిన యువతీయువకులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని, వారందరినీ చట్టప్రకారం ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. 2006 సంవత్సరం అనంతరం గడిచిన 20 సంవత్సరాల్లో నిర్వాసిత గ్రామాలలోని ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు వయసు కలిగి, వివాహాలు జరిగి, కుటుంబాలు విడిపోయిన వారు ఎందరో ఉన్నారన్నారు. 2006వ సంవత్సరంలో మేజర్ అయి ఉండి, కుటుంబ పెద్దగా ఉన్న వారికి మాత్రమే ఇంటి స్థలం ఇస్తామని చెప్పడం 2013 భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం చేయడమే అవుతుందన్నారు. 2026వ సంవత్సరం నాటికి 18ఏళ్ల కలిగిన వారికి ఇంటి స్థలం లభించక, ప్యాకేజీ అందక ఉద్యోగాలు లభించక గ్రామాలు ఖాళీ చేసి బయటకు వచ్చిన యువతీ యువకులు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికెఎం రఫీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి వందన్ కుమార్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)