సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతి ఆదివారం వసతి గృహాలకు తల్లిదండ్రులు

54 నిమిషాల క్రితం

cm ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వం కార్యక్రమాలపై విస్తృత ప్రచారం

- ప్రజల భాగస్వామ్యంతోనే సానుకూల ఫలితాలు

- రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంక్షేమ హాస్టళ్లలో మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ ఉండాలని, ప్రతీ నెలా మొదటి ఆదివారం విద్యార్ధుల తల్లిదండ్రుల్ని ఆహ్వానించి వసతి గృహాల్లో పరిస్థితులు, ఆహారం, తాగునీరు తదితర అంశాలపై వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగుపరచాలని, అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. వెలిగొండ, అల్లూరి విమానాశ్రయ ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం భారీగా ఉందని, దీనిని ఇతర అంశాలకూ వర్తింప చేయాలని సూచించారు. ప్రత్యేకించి మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ సహా వివిధ అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకు స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తాను 20 సార్లు పాల్గొన్నానని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశుభ్రత అంశాలపై ప్రజల్లో మరింత లోతైన అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా దాతలు అన్నార్తులకు సాయం అందించే అంశాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని లోటు పాట్లను సవరించుకోవాలని నిర్దేశించారు. బాధ్యులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి కృష్ణా నది జలాలు రావటంతో ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమైందని.. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ ఆన్‌లైన్ లో సేవలు అందించాలని సమీకృత సేవల విధానం ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ సహా వివిధ విభాగాలు అన్ని ధృవపత్రాలనూ ఆన్‌లైన్ లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవేర్ ద్వారా రాష్ట్రంలో సాగు స్థితిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రైతులకు సూచనలు జారీ చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యం పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటలు కాపాడుకోడానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూమిని నిరుపయోగంగా ఉంచకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. 5.70 లక్షల ఎకరాల్లో ప్రతీ ఎకరాను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్