- డిజిపి హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తోన్న 'రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు రేంజ్‌లు, యూనిట్లకు చెందిన సుమారు 1,900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా పోలీసు శాఖకు చెందిన మినిస్టీరియల్ స్టాఫ్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఎపిఎస్‌పి ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు క్రీడా పోటీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విట్ ఎపి యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఎఎన్‌యు)తో పాటు 6వ బెటాలియన్ ఎపిఎస్‌పి ప్రాంగణం పోటీలకు వేదికలుగా ఉండనున్నాయని తెలిపారు. సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, జట్టు భావనను మరింత పెంపొందించడమే ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. క్రీడల ద్వారా పోలీసు సిబ్బందిలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోలీసు క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు డిజిపి తెలిపారు.







కామెంట్‌లు (0)