- ప్రశ్నించే గొంతులను నొక్కడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
- మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
స్వాతంత్ర్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజలపై అక్రమ కేసులు, నోటీసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడటం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూడటం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. పౌరులకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, సమానత్వపు హక్కులు ఏ ముఖ్యమంత్రో ఇచ్చినవి కావని, అవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని ఆయన అధికార పక్షానికి స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం పూర్తికాదని, ఎన్నికల మధ్యకాలంలోనూ ప్రజల గొంతుకు విలువ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి రక్షణ, ప్రతి అర్హుడికి సంక్షేమం అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్య స్ఫూర్తి సాకారమవుతాయని అన్నారు. నిజమైన స్వాతంత్ర్యం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సమాజానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లని ఆయన ఉద్ఘాటించారు. పాలకుల అధికారం శాశ్వతం కాదని, కేవలం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే శాశ్వతమని గుర్తుచేశారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. సమాజంలో వివక్ష, అణచివేత, పేదరికం లేని వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి, హక్కుల సాధన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం రాజీలేని పోరాటం సాగిస్తుందని అన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, నలమారు చంద్రశేఖర్ రెడ్డి, కనకారావు, వేల్పుల రవికుమార్, పుత్తా శివ శంకర్, నారాయణమూర్తి, హర్షవర్ధన్ రెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)