డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా రాళ్లు
ప్రజాశక్తి – మార్టూరు(పల్నాడు) : మార్టూరు సమీపంలోని జొన్నతాళి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తాపడి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవే పోలీసుల కథనం మేరకు.. జే.పంగులూరు మండలం రాంకూరు ఎస్సీ కాలనీకి చెందిన కే.కన్నబాబు ట్రాక్టర్‌లో సైజు రాళ్ల లోడుతో బొల్లాపల్లి టోల్‌ప్లాజా వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన కంటైనర్ లారీ డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ కన్నబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో ఉన్న సైజు రాళ్లు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కన్నబాబును మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాబురావు తెలిపారు.







కామెంట్‌లు (0)