దేశాన్ని కార్పొరేట్, సామ్రాజ్యవాదుల దోపిడీ నుంచి కాపాడుకోవాలి
సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు
ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : దేశాన్ని కార్పొరేట్, సామ్రాజ్యవాదుల దోపిడీ నుంచి కాపాడుకునేందుకు ఈ నెల 28న భగత్‌సింగ్ జయంతి వేడుకలను వాడవాడలా నిర్వహించాలని యువతకు సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 28న భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన నవయువకుడిగా, సామ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా భగత్‌సింగ్‌ను ఆయన కొనియాడారు. దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్ప దేశభక్తుడని అన్నారు. అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం భగత్‌సింగ్ పోరాడారని తెలిపారు.
నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో రూ.14 లక్షల కోట్లను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసిందని రెడ్డి శంకరరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే చర్యలు చేపడుతున్నారని, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు, కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక కోడ్‌లు తీసుకొచ్చి దోపిడీదారులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాల కోసం పోరాడాల్సిన కర్తవ్యం యువతపై ఉందన్నారు. సమానత్వం కలిగిన భారతదేశం కోసం భగత్‌సింగ్ కన్న కలలను సాకారం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 28న జయంతి వేడుకలను వాడవాడలా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఎం నాయకులు పి.రమణమ్మ, వి.లక్ష్మి, రంభ శ్రీనివాసరావు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)