ప్రాదేశిక ఎన్నికల ఘట్టంలోనూ రెచ్చిపోతున్న టిడిపి శ్రేణులు
సిపిఎం నేత ఆవులయ్యపై హత్యాయత్నం
చిత్తూరు జిల్లా కార్యదర్శి కిడ్నాప్
నామినేషన్లను అడ్డుకుంటున్నా.. పోలీసుల ప్రేక్షకపాత్ర
ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో రెండో రోజు కూడా కూటమి శ్రేణులు రక్తపాతం సృష్టించాయి. పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డాయి. విపక్షాల వారిని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం వంటివి పునరావృతం అవుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లా కొమరోలులో టిడిపి గూండాలు బరితెగించారు. సిపిఎం మార్కాపురం జిల్లా కమిటీ సభ్యులు ఆవులయ్యపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. రాయితో తలపై దాడి చేయడంతో ఆయన ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొమరోలు 1, 2, 3 ఎంపిటిసి స్థానాలకు సిపిఎం తరఫున ఖరారైన అభ్యర్థులు పోసాని నాగమణి, ఎంబడి రేణుక, పోసాని అంజమ్మలతో నామినేషన్ వేయించడానికి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొమరోలు ఎంపిడిఒ కార్యాలయానికి సిపిఎం మార్కాపురం జిల్లా కమిటీ సభ్యులు ఆవులయ్య, సిపిఎం కొమరోలు మండల నాయకులు అంజమ్మ వెళ్లారు. బారికేడ్ల వద్ద పోలీసులు వారిని అడ్డుకొని మధ్యాహ్నం మూడు గంటలకు రావాలని చెప్పి పంపించేశారు. వీరంతా వెళ్లిపోయి పోలీసులు చెప్పిన సమయానికి తిరిగి వచ్చారు. అప్పటికే బారికేడ్ల వద్ద ఉన్న టిడిపి నాయకులు, ఆళ్లగడ్డ నుంచి తీసుకొచ్చిన సుమారు 200 మంది గూండాలు వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆవులయ్యపై ఏడెనిమిది మంది ఒకేసారి దాడి చేసి కింద పడేసి గొంతు నొక్కారు. అనంతరం ఆయన తలపై రాయితో గట్టిగా మోదారు. దీంతో, ఆవులయ్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కళ్ల ముందే ఈ దాడి జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆవులయ్యను సిపిఎం కార్యకర్తలు 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.
సిపిఎం చిత్తూరు జిల్లా కన్వీనర్ వాడ గంగరాజును కిడ్నాప్ చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లి ఎంపిటిసి స్థానానికి సిపిఎం తరఫున నామినేషన్ వేయడానికి వచ్చిన ఎం.కాంతను టిడిపి రౌడీ మూకలు నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసి ఆమెపై దాడి చేశాయి. కలెక్టర్ జోక్యం చేసుకొని మరో నామినేషన్ ఇస్తారు తీసుకోవాలని చెప్పడంతో వేచి ఉన్న సమయంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్... సిపిఎం జిల్లా కన్వీనర్ వాడ గంగరాజును వాహనంలోకి బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేశారు. దీనిపై సిపిఎం నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయనను విడిచిపెట్టారు. కలెక్టర్ సీరియస్ గా స్పందించడంతో అనివార్య పరిస్థితిలో నామినేషన్ వేసేందుకు ఎం.కాంతకు అధికారులు అనుమతి ఇచ్చారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోట ఎంపిటిసి స్థానానికి నామినేషన్ వేయడానికి సిపిఎం తరఫున నాగి పోగు పెంచలయ్య, ఆ నాయకులతో కలసి వెళ్లగా కూటమి నాయకులు అడ్డుకొని దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. దీనిపై ఎస్ఐకు ఫిర్యాదు చేయడంతో రెండో సెట్ నామినేషన్ పత్రాలను వేయడానికి పోలీస్ కానిస్టేబుల్‌తో పంపినా రెండోసారి కూడా పెంచలయ్యపై దాడి చేసి మళ్లీ నామినేషన్ పత్రాలను కూటమి నాయకులు లాక్కొని చించివేశారు.
బ్రహ్మంగారిమఠం సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థిని అడ్డుకున్న టిడిపి
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం జెడ్పిటిసి స్థానానికి నామినేషన్ వేసేందుకు సిపిఎం అభ్యర్థి గండి సునీల్ కుమార్ జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలోకి వెళ్లే మూడు దారులను పోలీసులు మూసేసి ముళ్ల కంచెలు వేసి లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. టిడిపికి చెందిన మూడు మూకలు అక్కడ ఉండి ఇతరులను ఎవరినీ రానీయకుండా అడ్డుకొని వెనక్కి పంపేశాయి. దీనిపై కడప జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి డిఆర్‌ఒ మల్లికార్జునుడుకు సిపిఎం నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీసుల రక్షణలో సిపిఎం అభ్యర్థితో నామినేషన్ వేయించాలని కోరారు. అయినా, స్పందన లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎట్టకేలకు డిఆర్‌ఒ జోక్యం చేసుకొని సునీల్ కుమార్ తో నామినేషన్ దాఖలు చేయించారు.
నరసరావుపేటలో సిపిఎం అభ్యర్థుల చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుంటున్న టిడిపి నాయకులు
పల్నాడు జిల్లాలో నామినేషన్ పత్రాలు చింతవేత
జెడ్పిటిసి స్థానాలకు సిపిఎం తరఫున నామినేషన్లు దాఖలు చేయడానికి పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్‌డిఒ కార్యాలయానికి క్రోసూరు నుంచి గంజిమాల రవిబాబు, సత్తెనపల్లి నుంచి పెండ్యాల ఉమా మహేశ్వరరావు, ముప్పాళ్ల నుంచి గుంటుపల్లి బాలకృష్ణ, నకరికల్లు నుంచి ఈపూరి కుమారి వచ్చారు. వారిపై టిడిపి నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను లాక్కొని చించివేశారు. సిపిఎం అభ్యర్థులు ఉమామహేశ్వరరావు, గుంటుపల్లి బాలకృష్ణలకు గాయాలయ్యాయి. టిడిపి గుండాయిజాన్ని నిరసిస్తూ ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, సిపిఎం అభ్యర్థులను పోలీసులు లోనికి పంపడంతో వారు నామినేషన్లు దాఖలు చేశారు.
నకరికల్లులో రిటర్నింగ్ అధికారి నుంచి నామినేషన్లు లాక్కొని చించివేత
నకరికల్లులో రిటర్నింగ్ అధికారి నుంచి 18 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టిడిపి నాయకుడు బాజీ చౌదరి బలవంతంగా లాక్కొని చించివేశారు. రిటర్నింగ్ అధికారి సెల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి గుంపుగా ఆయన రిటర్నింగ్ అధికారి గదిలోకి జొరబడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసిపి వారిపై టిడిపి వారు దాడి చేసి బలవంతంగా బయటకు పంపేశారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ పత్రాలు చించివేయడంతో జిల్లా ఉన్నతాధికారులకు రిటర్నింగ్ అధికారి నివేదిక అందజేశారు. బాజీ చౌదరి చించివేసిన నామినేషన్లలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థులకు సంబంధించి 12, టిడిపి ఎంపిటిసి అభ్యర్థులకు చెందిన ఆరు ఉన్నాయి. మొత్తం 18 మంది అభ్యర్థుల నుంచి మళ్లీ నామినేషన్లను స్వీకరించడానికి రిటర్నింగ్ అధికారి సిద్ధం కాగా, బాజీ చౌదరి మళ్లీ వచ్చి అడ్డుకొని ఆమెతో గొడవకు దిగారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తతలు
వైసిపి నాయకుల గృహనిర్బంధం
అనంతపురం జిల్లా రాప్తాడులో మండల పరిషత్ కార్యాలయంలో వైసిపి, టిడిపి శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఆకుతోటపల్లి, కొడిమి ఎంపిసిటి స్థానాలకు వైసిపి అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో కూటమి నాయకులు అడ్డుకున్నారు. దీంతో, తలెత్తిన ఘర్షణలో ఇద్దరు వైసిపి నాయకులకు గాయాలయ్యాయి. ఆత్మకూరులో నామినేషన్లకు హాజరవబోతున్న వైసిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని మార్గమధ్యంలో ఒడ్డుపల్లి వద్ద పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపేశారు. శింగనమల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శైలజనాథ్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను గృహనిర్బంధంలో ఉంచారు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లిలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వైసిపి నాయకులపై కూటమి నాయకులు దాడి చేశారు.
ఏలూరు జిల్లాలోనూ...
ఏలూరు మండలం కోమటిలంక గ్రామానికి చెందిన మద్దుల రత్నం వైసిపి తరఫున కలకుర్రు ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు తన భార్య జ్యోతి జరీనాను తీసుకుని జిల్లా పరిషత్ వెనుక ఉన్న మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తుండగా టిడిపికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమపై దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసినట్లు మద్దుల రత్నం తెలిపారు. వైసిపి అభ్యర్థి కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నామినేషన్ పత్రాలు చించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెదవేగి, దెందులూరు మండలాల్లోనూ తమ పార్టీ ఎంపిటిసి అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా టిడిపి నాయకులు అడ్డుకుంటున్నారని వైసిపి నాయకులు తెలిపారు.
తిరుపతిలో హౌస్ అరెస్టు
తిరుపతి రూరల్ మండలంలో ఎంపిపి అభ్యర్థి నాగలక్ష్మి భర్త చిన్ని యాదవ్ గోడ దూకి నామినేషన్ దాఖలు చేసి వస్తుండగా ఆయనపై కొందరు పిడిగుద్దులతో దాడి చేశారు. వేదాంతపురం, పాడిపేట, బిటిఆర్ కాలనీ ఎంపిటిసి అభ్యర్థులపై, విద్యార్థి నాయకుడు చెంగల్రెడ్డిలపై కూడా దాడులు జరిగాయని వైసిపి నాయకులు తెలిపారు. తిరుపతిలో వైసిపి నేతలు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేసి నామినేషన్ కేంద్రానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం నామినేషన్ సెంటర్ వద్ద వైసిపి వారిని టిడిపి వారు అడ్టుకున్నారు. రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట 2 ఎంపిటిసి స్థానానికి నామినేషన్ వేసేందుకు వస్తున్న వైసిపి అభ్యర్థి పాలెం కోటచంద్రయ్య వద్ద నామినేషన్ పత్రాలను జనసేన నాయకులు లాక్కొని చించివేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా టిడిపి నాయకులు అడ్డుకోవడంతో వైసిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. శ్రీరంగరాజపురం మండలం ఎంపిపి అభ్యర్థి శిరీష గురువారెడ్డి నామినేషన్ పత్రాలను బలవంతంగా టిడిపి నాయకులు లాక్కెళ్లి చించివేశారు.
కృష్ణగిరిలో కానిస్టేబుల్‌కు గాయాలు
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో టిడిపి, వైసిపి నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఇరుగ్రూపులకు వారితో పాటు ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కర్నూలులో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీనిని నిరసిస్తూ ఆమె రోడ్డుపై బైఠాయించారు. డోన్‌లో ఎంపిడిఒ కార్యాలయం వద్ద నామినేషన్ల దాఖలు సందర్భంగా కామగాణిగుంట్ల, ఆవులదొడ్డి గ్రామాలకు చెందిన టిడిపి ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.







కామెంట్లు (0)