- అసమానతలపై పోరాటమే సామాజిక శంఖారావం.
- కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బి.బలరాం.
- కులవివక్ష లేని సమాజ స్టాపనే ధ్యేయం : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి.
- జూలై 16వ తేదీ నుంచి జిల్లాలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా సామాజిక శంఖారావం
భీమవరం (పశ్చిమ గోదావరి) : దళిత సమస్యలపై, అసమానతలపై పోరాటంకై సామాజిక శంఖారావం చేపడుతున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బి.బలరాం తెలిపారు.
శుక్రవారం కులవివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం జిల్లా వర్క్ షాప్ శుక్రవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బి.బలరాం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ దళితులు అభివృద్ధికి దూరంగా ఉంటూ కులవివక్షను, అంటరానితనాన్ని అనుభవిస్తుండటం పాలకులు సిగ్గుపడాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు దళితులను కేవలం ఓట్లు బ్యాంకుగానే చూస్తున్నారని మండిపడ్డారు. గ్రామాలకు దూరంగా ఉండే దళితులు అభివృద్ధికి కూడా దూరంగానే ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని కులం మన భారతదేశంలో మాత్రమే ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3వేల గ్రామాల్లో కులవివక్ష రూపాలపై సర్వే చేసి దళితులు ఎదుర్కొనే అమానుషమైన వివక్ష, అంటారని తనాన్ని నిరూపించామని తెలిపారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కెవిపిఎస్ చేసిన పోరాటాల్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ను ఏర్పాటు చేయించి విజయం సాధించామని అదే తొలి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అయ్యిందని గుర్తించారు. 350 పైగా కులవివక్ష రూపాలను రాష్ట్ర ప్రభుత్వానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అందిస్తే రాష్ట్రంలో కులం లేదని చెప్పారని కానీ ఆ రిపోర్ట్ ను బయట పెడితే దేశంలోనే కులవివక్ష, అంటరానితనం పెరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు తేలిందన్నారు. 2005 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దళితులకు శ్మశాన వాటికను కేటాయించాలని కేవీపీఎస్ పోరాటం వలన జీవో 1235 ను విడుదల చేసి ప్రతి దళిత పేటకు 2ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ జీవో ను మాత్రం అమలు చేయడం లేదన్నారు. దళిత కాలనీలు అభివృద్ధి కోసం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించాలని పోరాడి సాధించుకున్నామని తెలిపారు. నేడు అదే తరహాలో అధ్యయనం, ఆందోళన, ప్రత్యక్ష పోరాటం వంటి మూడు పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాల్యాద్రి తెలిపారు. ఈ సామాజిక శంఖారావంలో దళితులుపై చూపే కులవివక్ష, అంటరానితనం రూపాలను బట్టబయలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. నేడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ హయాంలో కూడా దళితులపై దాడులు, హత్యలు బాగా జరిగాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంత్ బాబు దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సాంఘిక సమానత్వం కోసం సాగే ఈ సామాజిక ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులు, సమానత్వాన్ని కోరుకొనే ప్రజలందరూ సహకరించాలని బలరాం విజ్ఞప్తి చేశారు.
ఉండి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దళితులపై ప్రత్యక్షంగా అనేక విధాలుగా దాడులు చేస్తున్నా అధికార పార్టీ నేతలూ ఖండించడం లేదు, ప్రతిపక్ష వైసీపీ కూడా మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. దళితులపై అహంకార వైఖరిని ప్రదర్శిస్తున్నా అరికట్టలేకపోతున్నారని, ఆఖరికి దళిత ఓట్లు మాకు వద్దన్నా టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. యూట్యూబ్ లో కుల, మత, ప్రాంత ఘర్షణలకు తావిచ్చేలా మాట్లాడిన రఘురామ కృష్ణంరాజును మాత్రం ఖండించని ప్రభుత్వం యూట్యూబ్ ప్రశ్న రావణ్ ను మాత్రం కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాందువ్వ గ్రామంలో దళిత యువకుడు వీధి నవీన్ కుమార్ ను వేధించి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిన సిఐ పై నేటికీ చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళపై అణచేసేలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో పెత్తందారులు, భూస్వాములు, ఆధిపత్య కులదురాహంకారులు దళితులపై, గిరిజనులపై, వెనుకబడిన తరగతులపై చేస్తున్న అరాచకాలను,ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేలా సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అంతరాలు, అసమానతలు , కులవివక్ష లేని సమాజం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జే.ఎన్.వి.గోపాలన్ మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీలో కూడా దళితులు విద్యకు, వైద్యానికి, అభివృద్ధికి దూరంగానే ఉన్నారన్నారు. వీరికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు కూడా రానివ్వని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో కులవివక్ష రూపాలు మారాయని తెలిపారు. పుట్టుక మనచేతుల్లో ఉండదని కానీ అట్టడుగు వర్గాల కొరకు, అసమానతలు ఎదుర్కొనే వారికి అండగా నిలవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. దళిత సమస్యలను పరిష్కరించేలా దళితులందరినీ ఐక్యం చేసి భవిష్యత్ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తరతరాలుగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో, జాతరలో, సహపంక్తి భోజనాల్లో దళితులకు ప్రవేశాలను నిరాకరిస్తున్న ఘటనలు నేటికి పునరావృతం అవుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మామిడి శెట్టి రామాంజనేయులు, ఐద్వా జిల్లా కార్యదర్శి పుగాకు పూర్ణ, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్, యూటీఎఫ్ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకేవీ రామభద్రం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి షేక్ వలీ, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహా మూర్తి, ప్రజా సంఘాల జిల్లా నాయకులు కేతా గోపాలన్, కౌరు పెద్దిరాజు, కర్రి నాగేశ్వరరావు, పీవీ ప్రతాప్, కె. రాజారామ్మోహన్ రాయ్, ఎ.రవి మరియు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)