రూ.765 కోట్ల పరిహారం చెల్లింపులపై పూర్తి వివరాలు వెల్లడించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టులో జరిగిన చెల్లింపులు, ఒప్పంద నిబంధనలు, కాంట్రాక్టు రద్దు సమయంలో చెల్లించిన పరిహారంపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావులో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వ్యవసాయ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2023లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును పెద్ద ఎత్తున ప్రారంభించారని తెలిపారు. సుమారు 18 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన విష్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో 2023 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు రూ.5,692 కోట్లుగా అంచనా వేశారని, ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.23,647, వైర్లు, బాక్సులు తదితర అనుబంధ ఖర్చులకు రూ.11,070 చొప్పున కలిపి ఒక్కో కనెక్షన్‌కు సుమారు రూ.34,717 ఖర్చు అవుతుందని వారు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల కొనుగోలు ధరలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించిన ధరలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2024లో గృహ వినియోగదారుల స్మార్ట్ మీటర్లను సుమారు రూ.3,634కు కొనుగోలు చేశారని, అనంతరం అక్కడి విద్యుత్ నియంత్రణ సంస్థ సింగిల్ ఫేజ్ మీటర్ ధరను రూ.2,800కు, త్రీ ఫేజ్ మీటర్ ధరను రూ.4,100కు నిర్ణయించిందని తెలిపారు.
స్పెసిఫికేషన్లు పూర్తిగా ఒకేలా ఉండకపోయినా, రూ.3,000–4,000 పరిధిలో ఉన్న మీటర్లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు రూ.34,717 ఖర్చు చేయడం పట్ల ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు పూర్తికాకముందే డిస్కామ్‌లు సుమారు రూ.1,828 కోట్లు చెల్లించాయని వారు ఆరోపించారు. అనంతరం 2025లో కాంట్రాక్టును పరస్పర అంగీకారంతో రద్దు చేశారని, ఆస్తులను డిస్కామ్‌లు స్వీకరించడంతో పాటు కాంట్రాక్టర్‌కు టర్మినేషన్ అమౌంట్ చెల్లించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
తాజాగా 2026లో ఒప్పందం రద్దుకు పరిహారంగా APSPDCL నుంచి రూ.502 కోట్లు, జీఎస్టీతో కలిపి మొత్తం సుమారు రూ.765 కోట్లు చెల్లించినట్లు పేర్కొంటున్నారని, ఈ చెల్లింపులకు సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. 2023లో ఒప్పందం, 2024లో భారీ చెల్లింపులు, 2025లో కాంట్రాక్టు రద్దు, 2026లో పరిహారం చెల్లింపు జరిగినప్పటికీ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేదని విమర్శించారు. టర్మినేషన్ అమౌంట్ ఎలా నిర్ణయించారు? ఏ ఆస్తులను డిస్కామ్‌లు స్వీకరించాయి? ఇప్పటివరకు కాంట్రాక్టర్‌కు మొత్తం ఎంత చెల్లించారు? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఈ ప్రాజెక్టుపై 2023లోనే అప్పటి టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని వారు గుర్తుచేశారు. టెండర్ నిబంధనలు కంపెనీకి అనుకూలంగా ఉన్నాయని, సాంకేతికంగా ప్రాజెక్టు అమలు సాధ్యంకాదని, ధరలు అధికంగా ఉన్నాయని, ఒప్పందంలో పారదర్శకత లేదని అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఎన్నికల ముందు టిడిపి చేసిన డిమాండ్లు, ఇచ్చిన హామీలకు విరుద్ధంగా అదే విధానాలను కొనసాగించడం ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. రైతులకు ప్రయోజనం లేని విధంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)