సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ప్రాజెక్టు వద్ద పూల సుబ్బయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

1 గంట క్రితం

cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ

ప్రజాశక్తి - మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం తుది శ్వాస వరకు ఉద్యమాన్ని కొనసాగించిన సిపిఐ నేత పూల సుబ్బయ్య విగ్రహాన్ని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెన్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా‌డారు. అనేక దశాబ్దాల పోరాట ఫలితంగానే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టులోకి విడుదల కావడం హర్షణీయమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1984 దశకంలో నాటి ముఖ్యమంత్రి ఎన్‌‌టి రామారావు మార్కాపురం వచ్చిన సందర్భంగా సిపిఐ నాయకత్వంలోని ప్రతినిధి బృందం సభ్యులు పూల సుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, రావులపల్లి చెంచయ్య తదితర నాయకులు వెలిగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యత గురించి, ఈ ప్రాంతంలోని వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాల గురించి ఆయనకు వివరించారని తెలిపారు. దీంతో, ఎన్‌‌టి రామారావు పూల సుబ్బయ్య పేరుతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి సర్వే చేసేందుకు జిఒను కూడా అధికారికంగా విడుదల చేశారని గుర్తు చేశారు. అదే పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌‌టి రామారావు దగ్గర నుంచి ‌సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎంలు వైఎస్‌ఆర్‌, వైయస్ జగన్మోహన్‌‌రెడ్డి ఎవరిపాత్ర వారు పోషించారన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్