ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటూ... ఉత్తేజంగా సిపిఎం బైక్‌ యాత్ర

1 గంట క్రితం

పోలవరం నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటూ...
ఉత్తేజంగా సిపిఎం బైక్‌ యాత్ర
- నేడు చింతూరు ఐటిడిఎ వద్ద మహాధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేడు చింతూరు ఐటిడిఎ వద్ద మహాధర్నా

ప్రజాశక్తి - విఆర్‌.పురం (పోలవరం జిల్లా) : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన బైక్‌ ‌యాత్ర ఆదివారం పోలవరం జిల్లా విఆర్‌.పురం మండలంలో ఉత్తేజంగా సాగింది. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ యాత్ర ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల మీదుగా నాలుగో రోజు విఆర్‌.పురం మండలానికి చేరుకోగా గ్రామగ్రామాన అపూర్వ స్వాగతం లభించింది. పూలమాలలు వేసి, హారతులిచ్చి గ్రామాల్లోకి నిర్వాసితులు ఆహ్వానించారు. తమ సమస్యలను నాయకులకు చెప్పుకుని వినతిపత్రాలు అందజేశారు. పలుచోట్ల జరిగిన సభల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ముంపునకు గురైన గ్రామాల్లోని అందరికీ పరిహారం, పునరావాసం అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామాలను తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకునికి ప్యాకేజీ ఇవ్వాల్సిందేనన్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని చెప్తూ సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్నవరం వద్ద బ్రిడ్జి నిర్మించాలని, పెద్దమట్టపల్లి నుండి నర్సింగపేట వరకూ రోడ్డు వేయాలని డిమాండ్‌ ‌చేశారు. తోటపల్లి, అన్నవరం, ఉమ్మడివరం, చిన్నమట్టపల్లి, గుర్రంపేట, సున్నంవారిగూడెం తదితర గ్రామాల్లో అందరినీ ముంపు జాబితాలో చేర్చి పరిహారం చెల్లించాలని కోరారు. ధర్మతాళ్లగూడెం నుంచి ప్రారంభమైన ఈ బైకు యాత్ర విఆర్.పురం, రాజుపేట, అన్నవరం, గుర్రంపేట, పెద్దమట్టపల్లి, చింతరేగుపల్లి, అడివి వెంకన్నగూడెం, సోములు గూడెం, రామవరం, రామవరంపాడు, చొప్పల్లి, ములకలపల్లి, కుందులూరు మీదుగా జల్లివారిగూడేనికి చేరుకుంది. నాలుగో రోజు సుమారు 70 కిలోమీటర్లు బైకు యాత్ర సాగింది. రేఖపల్లి జంక్షన్ వద్ద పూనెం సత్యనారాయణ, చిన్నమట్టపల్లిలో కారం శిరమయ్య, సున్నంవారిగూడెంలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అడివి వెంకన్నగూడెంలో మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి స్తూపాల వద్ద యాత్రాబృందం నివాళ్లర్పిస్తూ ముందుకు సాగింది. పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, సున్నం రాజులు, మాజీ ఎంపిపి కారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సోమవారం చింతూరు ఐటిడిఎ వద్ద జరిగే మహాధర్నాకు నిర్వాసితులు భారీగా కదిలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్