ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Delhi: మహిళా జర్నలిస్టులపై పోలీసు లైంగిక వేధింపులు

1 గంట క్రితం

brinda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:56 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని ఢిల్లీ పోలీసులు

- పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ప్రజాసంఘాల ఆందోళన

- మహిళ ఫిర్యాదు చేస్తే స్పందించరా... బృందా క‌ర‌త్‌ ఆగ్రహం

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జంతర్‌ ‌మంతర్‌ వద్ద సిఇసిని తొలగించాలనే ఆందోళనల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. రక్షణగా నిలవాల్సిన పోలీసులే వేధింపులకు దిగడంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో పలువురు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆదివారం పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. ఢిల్లీ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ వివేక్‌ భగత్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్టు శనివారం తెలిపారు. ఆమె ఫిర్యాదు అనంతరం మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు తమని కూడా పోలీసులు వేధించారని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసు అధికారి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఢిల్లీలో ఉద్రిక్తతకు దారితీసింది.

​వీడియోలుంటేనే కేసు నమోదు..

బాధితుల ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నింధితుడైన పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. బాధితురాలితో పాటు సిపిఎం సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత స‌హాయ‌ కార్యదర్శి ఐషీ ఘోష్‌, సిజెపి కో కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌, సిజెపి న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్‌, జ‌ర్న‌లిస్టు రిషవ్ రంజన్ తదితరులు పోలీసు అధికారులను కలిశారు. లైంగిక వేధింపులకు పాల్ప‌డిన ఎసిపి వివేక్ భగత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని పోలీసుల‌ను కోరారు. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కొనసాగుతోందని, ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల్సిన అవసరం లేదని, మీ వద్ద వీడియో ఆధారాలుంటేనే కేసు నమోదు చేస్తామంటూ ఢిల్లీ పోలీసులు వాదనకు దిగారు. ఆగ్రహించిన నేతలు వీడియోలు లేకపోతే నేరం చేయనట్టేనా? బాధితురాలు వాగ్మూలం పనికి రాదా? అంటూ పోలీసులను నిలదీశారు. ఫిర్యాదు కూడా నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని వారు విమర్శించారు.

​ఎసిపిని కాపాడటానికే : బృందా క‌ర‌త్‌

​ ఈ సందర్భంగా బృందా క‌ర‌త్ మాట్లాడుతూ ‘‘చట్టం ప్రకారం ఏ మహిళైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందే. ఆ తరువాతే విచారణ జరుగుతుంది. పార్లమెంటరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. యూనిఫారంలో ఉన్న ఎసిపి వివేక్ భగత్ ఒక మహిళా జర్నలిస్ట్‌ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని (ఆమెను అనుచితంగా తాకాడని), ఆ అమ్మాయి ఎసిపి వివేక్ భగత్‌ను చూసి ‘ఏం చేస్తున్నావు?’ అంటూ నిలదీయగా, అక్కడి నుండి జారుకున్నాడని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసమే తాము కొన్ని గంటలపాటు వేచి చూస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు నిరాకరించడంతోపాటు ఈ కేసును పరిశీలిస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారి ఎవరనేది కూడా చెప్పడం లేదన్నారు. మహిళల భద్రతా చట్టాల కోసం దశాబ్దాలుగా ప్రజలు చేసిన పోరాటాలను అమిత్ షా పరిధిలోని ఢిల్లీ పోలీసులు నాశనం చేస్తున్నారని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమని బృందా కరత్ స్పష్టం చేశారు.

​వెల్లువెత్తిన నిరసనలు

​ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వరకు మార్చ్‌ నిర్వహించారు. సిజెపి కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియ‌న్ ఉమెన్స్ ప్రెస్ క్రాప్స్‌, ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, కేరళం యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ తదితర సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడటం, బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల భద్రత, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య నిరసనల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో ఈ ఘటన తెలుపుతుందని పలువురు విమర్శిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్