సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పన్ను వసూళ్లకు ఆధార్‌ అనుసంధానం !

01 ఆగస్టు, 2026

gst
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆదాయానికి కీలకంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం

- 12 శాతం పెరిగిన జిఎస్‌‌టి వసూళ్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పన్ను చెల్లింపుదారుల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే విషయాన్ని వాణిజ్య పన్నులశాఖ అధికారులు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. తాజాగా జులై మాసం పన్నుల వసూళ్లపై వివరాలను వెల్లడించారు. గతేడాది జులై కన్నా 12 శాతం వరకు వృద్ధి కనిపించినట్టు పేర్కొన్నారు. ఎఐ ద్వారా తీసుకుంటున్న చర్యలు కూడా ఆదాయం పెరగడానికి కారణమవుతోందని వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల వసూళ్లు జులై వరకు రూ.20,466 కోట్లకు చేరినట్టు వాణిజ్య పన్నులశాఖ వెల్లడించింది. జాతీయ వృద్ధి 17 శాతంగానే ఉందని పేర్కొంది. ఇందులో జిఎస్‌‌టి ద్వారా రూ.13,283 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజా గణాంకాలు మేరకు జులై నెలలో రూ.3,268 కోట్ల వరకు పన్నుల వసూళ్లు జరిగాయి. ఇదే గతేడాది జులైలో రూ.2,930 కోట్లు పన్నులు వసూలు కావడం గమనార్హం. తాజా వసూళ్ళలో ఐజిఎస్‌‌టి ద్వారా రూ.1,994 కోట్లు, పెట్రోలియంపై వ్యాట్ ద్వారా రూ.1,686 కోట్లు వృత్తి పన్ను ద్వారా రూ.49.71 కోట్లు వసూలయ్యాయి. అలాగే జులై వరకు జరిగిన వసూళ్లలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధికంగా కర్ణాటకలో రూ.34,151 కోట్లు వసూలు కాగా, తమిళనాడులో రూ.29,659 కోట్లు, తెలంగాణలో 17,438 కోట్లు వసూలు అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రాలో 13,246 కోట్లు వసూలయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించడం, పన్ను ఎగవేతకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించడం, పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన పెంచడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. అలాగే పన్ను వసూళ్లకు టెక్నాలజీ వినియోగించడం, ఎఐ, డేటా విశ్లేషకులతో పన్ను ఎగవేతకు చెక్‌ పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఎఐ ద్వారా హైరిస్క్‌ పన్ను చెల్లింపుదారుల గుర్తింపు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆధార్‌ ధ్రువీకరణతో నకిలీ సంస్థలకు అడ్డుకట్ట వేస్తున్నట్టు వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల గుర్తింపును ధ్రువీకరించేందుకు యుఐడిఎఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లు, ఉనికిలో లేని సంస్థలను గుర్తించే అవకాశం పెరిగిందని, దీంతో నకిలీ సంస్థల ద్వారా జరిగే పన్ను మోసాలను నియంత్రించేందుకు వీలవుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్