• పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన
• లోక్‌సభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలని, విద్యార్థులపై పోలీసుల దాడి గురించి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల దాడి, అయోధ్య రామమందిరం విరాళాల చోరీకి వ్యతిరేకంగా సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
గందరగోళం మధ్యే బిల్లుల ఆమోదం..
లోక్‌సభను ప్యానెల్ స్పీకర్ ప్రేమచంద్రన్ ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు హోరెత్తించారు. జులై 20న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ గురించి వివరణ ఇవ్వాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో సభ సమావేశం కాగానే, కేవలం కొన్ని సెకన్లలోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష ఎంపిలు వ్యతిరేకించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కేరళ పేరు మార్పు బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును మంత్రి మురళీధర్ మోహల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. ఆందోళన మధ్యే ఎటువంటి చర్చ లేకుండా ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.
అమిత్ షా చర్చకు సద్ధమే కానీ..
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సిద్ధంగా ఉన్నారని, కానీ కొన్ని కండీషన్లు ఉన్నాయని, ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దీనికి ప్రతిపక్ష ఎంపి కెసి వేణుగోపాల్ స్పందిస్తూ.. చర్చకంటే ముందు విద్యార్థులపై క్రూరమైన దాడి గురించి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి లోక్‌సభ కార్యక్రమాలు ప్రతి రోజూ వాయిదాపడుతూనే ఉన్నాయి. 8 బిల్లులు ప్రవేశపెట్టగా దాంట్లో 6 బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.
ఆయన మౌనం హింసకు ఆమోదం: రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దాదాపు 20 రోజులు గడిచినా, సమాధానం చెప్పడానికి అమిత్ షా పార్లమెంటుకు రాలేదు. చర్చ కోసం ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానాన్ని ఆయన తిరస్కరించారు. ఆయన మౌనం పొరపాటు కాదు. అది హింసకు ఆమోదం తెలపడమే. ఆయన దోషి అయినా అయి ఉండాలి లేదా అసమర్థుడైనా అయి ఉండాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయనను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదు’ అని అన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సభను ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రామ మందిర విరాళాల ‘దొంగతనం’పై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. రామమందిర విరాళాల దొంగతనం, నిరసనకారులపై పెల్లెట్ గన్‌ల వాడకం వంటి అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించగా, ఛైర్మన్ దానిని అనుమతించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అదే సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ది బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’ను సభలో చర్చకు ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల ఆందోళనతో సభను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వెంటనే సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2:15 గంటలకు తిరిగి సమావేశమైన సభలో వలసవాద కాలం నాటి చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చే బిల్లును నిర్మలా సీతారామన్ చర్చకు పెట్టారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించి, సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రామ మందిర విరాళాల ‘దొంగతనం’పై ఆందోళన
అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దొంగతనం, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దురాగతాలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సోమవారం నాడు పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సిపిఎం ఎంపిలు జాన్ బ్రిట్టస్, వి శివదాసన్‌తో సహా ప్రతిపక్ష ఎంపిలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని, ఎంపిలు పార్లమెంటు మకర ద్వారం ముందు ‘ఛందా చోర్, గడ్డి చోర్’, ‘అమిత్ షా జవాబ్ దో’, ‘బిజెపికే దఫ్తర్ మే, ఛందా చోర్ కహా మిలేంగే’ వంటి నినాదాలు హోరెత్తించారు.
కమ్యూనిస్టులపై నోరుపారేసుకున్న నిర్మలా....
న్యూఢిల్లీ : యుపిఐ చెల్లింపులపై ఫీజుల వసూలు విషయంలో బిజెపి ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఎం ఎంపి జాన్‌బ్రిట్టాస్ విమర్శించారు. అయితే ఆయన ప్రసంగం పూర్తికాకుండానే డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ మధ్యలోనే నిలిపేశారు. దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనగా జాన్‌బ్రిట్టాస్ వాకౌట్ చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు దేశంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలోని కమ్యూనిస్టులు ‘‘పూర్తి పిరికివాళ్లు’’ అంటూ రెచ్చిపోయారు. తన సమాధానం వినకుండానే బ్రిట్టాస్ సభ నుండి బయటకు వెళ్లిపోయారని తన అక్కసువేల్లగక్కారు.
ప్రజలపై భారీ భారాన్ని మోపుతోంది
- అమెరికా ఒత్తిడికి బిజెపి ప్రభుత్వం లొంగిపోయింది
- సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు చెల్లించాలనే అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఎం రాజ్యసభ పక్ష నేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ యుపిఐపై ఛార్జీలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధులు పట్టుబట్టిందన్నారు. బ్రెజిల్ ఆ ఒత్తిడికి లొంగలేదని, కానీ భారత్ లొంగిపోయిందన్నారు. దీంతో ప్రజలపై భారీగా పన్నుల భారాన్ని మోపుతొందని తెలిపారు. 2023లో జరిగిన జి-20 సమావేశంలో ప్రధాని మోడి, భారతదేశ యుపిఐని ఒక ఉచిత ప్రజా ప్రయోజనంగా తీసుకువచ్చామన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే, ప్రధానమంత్రి ఇచ్చిన హామీని బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు ఉల్లంఘిస్తోందన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు.
రాజ్యసభలో ‘ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్’, ‘పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు’పై కూడా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం లక్ష్యాలు పూర్తిగా విఫలమయ్యాయనే వాస్తవాన్ని ప్రభుత్వం సభలో అంగీకరించాలన్నారు. ‘‘ఈ పన్ను కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, వ్యాపారులపై పడిన భారం వినియోగదారులపైకి బదిలీ కాకుండా ఉంటుందా?’’ అని ఆయన ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. డిజిటల్ చెల్లింపులు చేసే ప్రజలపై పరోక్షంగా పన్ను విధించాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నారని అన్నారు. ‘‘అమెరికా జనాభాకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపుల విధానంలో ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.







కామెంట్‌లు (0)