- వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతల పిలుపు
- స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
ప్రజాశక్తి-విజయవాడ : ఇండియా వేదికలోని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర వామపక్ష శక్తులు, ప్రజాసంఘాలు, స్వతంత్ర వ్యక్తులు, మేధావులు, పుర ప్రముఖులు, కార్మికులు, కష్టజీవులంతా ఏకమై సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావును విజయవాడ మేయర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఆయన నామినేషన్ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలతో కలిసి ర్యాలీగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. స్వతంత్ర మేయర్ అభ్యర్థిగా ఎబి వెంకటేశ్వరరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సర్వీసులో మచ్చలేకుండా విధులు నిర్వర్తించారని అన్నారు. నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆయనను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టాలని తామంతా చర్చించి కోరామని, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... విజయవాడ నగర పౌరుల తరఫున ఎబి వెంకటేశ్వరరావును స్వతంత్ర మేయర్ అభ్యర్థిగా నిలబెట్టడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లుగా విజయవాడ నగరం నిర్లక్ష్యానికి గురైందని, నగర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మేయర్ అభ్యర్థి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అవినీతి, అసమర్థతతో దెబ్బతిన్న విజయవాడను బాగుచేసుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. స్థానిక స్వపరిపాలన ఎలా ఉండాలో, నగరపాలక సంస్థ ఎలా పనిచేయాలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా విజయవాడను తీర్చిదిద్దుదామని అన్నారు.
‘‘దేశం అంటే డబ్బు కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్’’ అనే విషయాన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిదని పేర్కొన్నారు. తన స్వతంత్ర అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచిన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకత్వాలకు, ప్రజాసంఘాలకు, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావుకు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్కు, పుర ప్రముఖుడు ఎం.సి. దాస్ తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, చిగురుపాటి బాబూరావు, సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలనుకొండ శివాజీ, సెంటర్ ఫర్ లిబర్టీ నాయకుడు నల్లమోతు చక్రవర్తి, రైతు సంఘం సీనియర్ నాయకుడు వై. కేశవరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ, వల్లూరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)