గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్టీల్ ప్లాంట్‌‌లో ప్రమాదాలను అరికట్టాలి

2 గంటల క్రితం

chnr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 11:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఎమ్‌‌డిని అరెస్టు చేయాలి : నర్సింగరావు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ప్రమాదాలను వెంటనే అరికట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌‌కెఎస్‌‌వి.కుమార్‌‌తో కలిసి గురువారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి పది మంది కార్మికులు మరణించి నెల రోజులైందని, అయినా కేంద్ర ఉక్కు మంత్రి నియమించిన దర్యాప్తు కమిటీ నేటికీ నివేదికను వెల్లడించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన దర్యాప్తులో ఎనిమిది తీవ్ర లోపాలను గుర్తించారని, ఆ లోపాలకు సమాధానం ఇవ్వాలని గత నెల 23న విశాఖ స్టీల్‌ యాజమాన్యానికి నోటీసు ఇచ్చారన్నారు. ఫ్యాక్టరీ అధికారులు 2025 డిసెంబర్ 1న విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 645 భద్రతా లోపాలను గుర్తించి 15 రోజుల్లో సంజాయిషీలను కోరారని, అయినా స్టీల్ యాజమాన్యం దేనికీ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 2025లో జరిగిన తీవ్ర ప్రమాదాల్లో 12 మంది కార్మికులు మరణించారన్నారు. యాజమాన్యం భద్రతా లోపాలపై కోర్టుల్లో 37 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య నిర్లక్ష్యానికి బాధ్యతగా విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2020లో ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంలో దక్షిణ కొరియా నుండి వచ్చిన డైరెక్టర్‌తో సహా 12 మందిని క్రిమినల్ నిర్లక్ష్యం కింద అరెస్టు చేశారని, నెల రోజులు విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్నారని గుర్తు చేశారు. అంత కంటే తీవ్రమైన భద్రతా నేరాలు జరుగుతున్న విశాఖ స్టీల్ అధికారులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేటీకరణ విధానాల పట్ల మెతకవైఖరి పాటిస్తోందన్నారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా నష్ట పరిహారం ఇస్తే సరిపోతుందనే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అధికారులను, కార్మికులను యాజమాన్యం తొలగించిందని చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం కార్మికులు, అధికారులు కలిసి 56 మంది పనిచేయగా నేడు 18 మంది మాత్రమే పనిచేస్తున్నారని, గతంలో కీలక విభాగాలలో ఒక్కొక్క విభాగానికి ఒక సేఫ్టీ అధికారి పనిచేయగా నేడు మొత్తం స్టీల్‌ప్లాంట్‌లో ముగ్గురు మాత్రమే మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రమాదం జరిగిన ఎస్‌ఎంఎస్‌ ‌విభాగంలో గతంలో రెండు వేల మంది కార్మికులు పనిచేయగా, నేడు 700 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై కోర్టులో భద్రతా లోపాలపై ఫ్యాక్టరీ అధికారులు 22 కేసులు పెట్టారన్నారు. అన్నింటిలోనూ నేరం ఒప్పకుని విశాఖ స్టీల్ యాజమాన్యం జరిమానాలు కట్టిందని వివరించారు. ప్లాంట్‌‌లోని భద్రతపై కార్మికులంతా ఉద్యమిస్తున్నారని, ప్రతి డిపార్ట్‌మెంట్‌లోని భద్రతా లోపాలను కేంద్ర ఉక్కు మంత్రి దృష్టికి తెస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భద్రతా ప్రమణాలు పాటించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్