- కఠినంగా శిక్షించాలి : కెవిపిఎస్
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : దొంగతనం నెపంతో దళిత యువకుడిపై దాడి చేసి మృతికి కారణమైన నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు గుంటూరు జిల్లా మంగళగిరి డిఎస్‌పి మురళీ కృష్ణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... ప్లాస్టిక్ ట్రే వ్యాపారి మామిడి నాయుడు, ఆయన కుమారుడు రాజు... శుక్రవారం లారీలో ట్రేలు తీసుకుని నర్సాపురం నుంచి మంగళగిరి వచ్చారు. మంగళగిరి -తెనాలి ఫ్లై ఓవర్ కింద లారీని ఉంచారు. ఈ క్రమంలో పాత మంగళగిరికి చెందిన మేకల చిన్న రమేష్ (44) ట్రేలు దొంగతనం చేస్తున్నాడనే నెపంతో స్తంభానికి కట్టేసి అతనిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య కల్పన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడు దళితుడు అయినందున నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి స్వస్థలం తుళ్లూరు మండలం దొండపాడుగా గుర్తించారు. 15 సంవత్సరాల నుంచి మంగళగిరిలో నివాసముంటున్నారని డిఎస్‌పి తెలిపారు.
కెవిపిఎస్ ఖండన
దొంగతనం పేరుతో దళితుడైన మేకల చిన్న రమేష్ ను స్తంభానికి కట్టేసి దాడి చేయడాన్ని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వై కమలాకర్ ఖండించారు. నిందితులు మామిడి నాయుడు, రాజులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)