ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువతి హత్య కేసులో నిందితుడు అరెస్టు

17 గంటల క్రితం

arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చిలకలూరిపేట (పల్నాడు జల్లా) : ప్రేమించిన యువతిని కిరాతంగా చంపి, పెట్రోలు పోసి తగులబెట్టిన ఉన్మాదిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్ లో జిల్లా డిఎస్ పి హనుమంతరావు మీడియాకు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణం వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తె హసీనా యాస్మిన్ (23), పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లెకు చెందిన బాల సైదులు ఇంజనీరింగ్ చదివే క్రమంలో ప్రేమించుకున్నారు. చదువు ‌పూర్తయిన తరువాత హసీనా యాస్మిన్ సూళ్లూరు పేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. బిటెక్ మూడో సంవత్సరం మధ్యలో ఆపేసిన బాల సైదులు కారంపూడిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తనతో హసీనా తక్కువగా మాట్లాడడం, మరో వ్యక్తికి దగ్గరవుతోందని సైదులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల నాలుగున హసీనాకు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి కారంపూడి రప్పించాడు. అక్కడి నుంచి కారంపూడి - నకరికల్లు రోడ్డులోని ఎన్‌ఎస్‌పి కాలువ పశ్చిమ కట్ట వద్ద ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లా డు. మాట్లాడుకునే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం హసీనాకు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సాక్ష్యాధారాలు లభించకుండా తన వాహనంలోని పెట్రోలు తీసి మృతదేహం పై పోసి నిప్పంటించి అక్కడి నుండి పరారయ్యాడు. కూతురు ఇంటికి రాకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో హసీనా యాస్మిన్ తండ్రి మస్తాన్ వలి చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు ఆగస్టు ఎనిమిది కారంపూడి పాత సినిమాహాలు సెంటర్ (హోండా షోరూం) వద్ద నిందితుడు సైదులును అరెస్టు చేశారు. మహిళ అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్ పి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్