ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లలో రాష్ట్రంలో సాధించిన ఆర్థిక ప్రగతి పత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాట పట్టిస్తే ఆ తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం విధ్వంసం సృష్టించి వ్యవస్థలను కూల్చేసిందని, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని దెబ్బతియ్యడంతో పాటు రూ.6.94 లక్షల కోట్ల విలువగల స్థూల ఉత్పత్తికి నష్టం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, దీంతో ఎ.పి బ్రాండ్ మసకబారిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. కూటమి గడిచిన రెండేళ్ల కాలంలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ఆర్థిక వృద్ధి రేటును, స్థూల ఉత్పత్తి విలువను గణనీయంగా పెంచిందని, రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించడంతో పాటు సొంత ఆదాయాన్ని పెంచి రాష్ట్ర బడ్జెట్ వ్యయాన్ని పెంచామని, సంక్షేమానికి భారీగా ఖర్చు చేయడంతో పాటు ఆగిపోయిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి నేటికి పుష్కర కాలం పూర్తయింది. అభివృద్ధిపై కూటమి పార్టీలు, వైసిపిల మధ్య తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. వాస్తవంగా 2014-19 మధ్య తెలుగుదేశం అనుసరించిన కేంద్ర బిజెపి నయా ఉదారవాద ఆర్థిక విధానాలనే వైసిపి ఐదేళ్లు అమలు చేసింది. ఇప్పుడు తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి అవే విధానాలను విచ్చలవిడిగా అమలు చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధి పట్ల అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, దృక్పథంలో వీటి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన పత్రంలోని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో, వీరు సాధిస్తున్న అభివృద్ధి ఎవరికి దక్కుతున్నదో, ఎవరి ప్రయోజనాల కోసం ఈ పార్టీలు పని చేస్తున్నాయో, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
2014-19 కాలంలో సగటున 11.3 శాతం వృద్ధి రేటు సాధించగా, వైసిపి పాలనలో 2019-24 లో 10.3 శాతానికి సగటున వృద్ధిరేటు పడిపోవటం వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సుమారు రూ.6.94 లక్షల కోట్ల నష్టం జరిగిందని, దీనివల్ల తలసరి ఆదాయం రూ. 51816 కోల్పోయామని ప్రధాన విమర్శ. ఈ రెండేళ్ల కాలంలో తిరిగి వృద్ధి రేటును 11.3 శాతానికి పెంచగలిగామని చెప్పారు. గత మూడు దశాబ్దాల నుండి అభివృద్ధి అంటే వృద్ధి రేటు, స్థూల ఉత్పత్తి పెరుగుదలగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు ఇదే జపం చేస్తున్నారు.
వృద్ధి రేటు, స్థూల ఉత్పత్తి పెంపునకు పెద్దఎత్తున ప్రభుత్వ, రైతుల భూములను కారుచౌకగా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. బలవంతపు భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, అసైన్డ్ భూములను దౌర్జన్యంగా గుంజుకుంటున్నారు. ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. భూ వినియోగం, జోనింగ్ నిబంధనలపై ఉన్న నియంత్రణలన్నీ సడలించి, స్వేచ్ఛా మార్కెట్ శక్తులకు వదిలేశారు.
రాష్ట్రంలో 23 పట్టణ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి భూ స్పెక్యులేటివ్ వ్యాపారాన్ని పెంచారు. ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ఆదివాసీ గిరిజన అటవీ ప్రాంతాన్ని కూడా కార్పొరేట్ల పరం చేసే చర్యలు ముమ్మరం చేశారు. పర్యావరణ నిబంధనలను బలహీనం చేసి పెట్టుబడులను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. 974 కిలోమీటర్ల అతి పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులు లాభాలు పోగేసుకోవటానికి కేటాయిస్తున్నారు. బీచ్ శాండ్ మైనింగ్, టూరిజం కేంద్రంగా బడా పెట్టుబడులకు తీరంపై గుత్తాధిపత్యం కల్పిస్తున్నారు. అందుకు మారిటైమ్, తీర ప్రాంత రెగ్యులేటరీ జోన్ (సి.ఆర్.జెడ్) నిబంధనలను మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో రూపొందించిన విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికల అమలుకు పూనుకున్నారు.
భూములు, సహజ వనరులు, ఖనిజ సంపద వంటివి పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడంతో పాటు అనేక రకాల రాయితీలు కూడా యథేచ్ఛగా ఇస్తున్నారు. జి.ఎస్.టి, విద్యుత్, మంచినీటి చార్జీల మినహాయింపుతో పాటు వయబులిటి గ్యాప్ పేర ఉచితంగా ఎదురు పెట్టుబడి ఇస్తున్నారు. రోడ్లు, రైలు, విద్యుత్ అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వమే సొంత నిధులతో కల్పిస్తున్నది. వీటన్నిటి ద్వారా రాష్ట్ర వృద్ధి రేటు, స్థూల ఉత్పత్తిని పెంచుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా రెండు రకాలుగా నష్టపోతున్నది. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి సమకూరుస్తున్న పన్ను ఆదాయం పెద్దఎత్తున పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తున్నారు. రెండోది పెట్టుబడిదారులకు అనేక పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడంతో ఈ వర్గాల నుండి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన వేల కోట్ల పన్ను ఆదాయానికి గండిపడుతున్నది. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతున్నా దీనికి సమాంతరంగా రాష్ట్ర పన్నుల ఆదాయ రేటు పెరగటం లేదు. గడిచిన రెండేళ్లలో కేవలం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం జిడిపి లో 7 శాతానికి మించి రాలేదు. మరొక వైరుధ్యం కూడా కొనసాగుతున్నది. రాష్ట్ర జిడిపి లో చూస్తే రాష్ట్ర బడ్జెట్ వ్యయం పెరగక పోగా తగ్గిపోతున్నది. 2018-19లో బడ్జెట్ వ్యయం రాష్ట్ర జిడిపి లో 17.2 శాతం ఉంటే 2025-26 కి 15.94 శాతానికి పడిపోయింది.
అమరావతి, పోలవరం, బడా ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రజా ప్రాధాన్యతలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. గత రెండేళ్లలో మొత్తం బడ్జెట్ వ్యయంలో ప్రభుత్వం మూలధన పద్దు కింద ఖర్చు చేసింది సగటున 8 శాతం మాత్రమే. రాష్ట్ర విభజన నుండి ఇదే తంతు. ఇక 12 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు పాలుచేశారు. ఇప్పటికీ నిరంతరం అప్పుల వేటలోనే కూటమి ప్రభుత్వం ఉంది. గత వైసిపి ప్రభుత్వాన్ని మించిపోయింది. అప్పులు, వడ్డీల భారాన్ని తగ్గించామని చెప్పినా అప్పులు చేయనిదే రోజు గడవని పరిస్థితి. ఈ రెండేళ్ల కాలంలో 2024-25 లో రూ.81,597 కోట్లు, 2025-26 లో రూ.79,395 కోట్లు అప్పులు చేశారు. రాష్ట్ర మొత్తం అప్పు నేడు రూ.7.11 లక్షల కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో 36.66 శాతానికి సమానం. ఇవిగాక బడ్జెటేతర అప్పులు రూ.లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిని బడ్జెట్ లెక్కల్లో చూపరు. ఇక అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూ.50 వేల కోట్లకు పైగా రుణం పొంది ఖర్చు చేస్తున్నారు. ఇంకా భారీగా అప్పులు సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ బడ్జెట్ పద్దులో చూపరు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి, ఉద్యోగులు, రిటైర్ అయిన వారి బకాయిలు ఇవన్నీ చూస్తే రాష్ట్రం అప్పుల ఊబి దిశగా వెళుతున్నది.
మరో ప్రమాదకర అప్పులు కూడా చేస్తున్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం హానికర సంస్కరణలకు ముడి పెట్టి ఇస్తున్న అప్పులు ఇవి. గత వైసిపితో పాటు ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా ఎగబడి తీసుకుంటున్నది. ఇవి తీసుకొని ప్రైవేట్ పెట్టుబడుల స్వేచ్ఛకు, దోపిడీకి ఆటంకాలుగా ఉన్న చట్టాలను మార్చేస్తున్నారు. కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్ లుగా అమలు చేయడం, ఒకే కార్డు - ఒకే దేశం, పట్టణ, విద్యుత్ సంస్కరణలు వంటి వాటిని అమలు చేస్తూ ప్రజలపై భారాలు, ప్రైవేటీకరణ చర్యలు చేపడుతున్నారు.
ఇవిగాక కేంద్ర ప్రభుత్వం సంస్కరణల షరతులతో కూడిన స్మార్ట్ సిటీ, అమృత్, అర్బన్ ఛాలెంజ్ వంటి ప్రమాదకర పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానాన్ని పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో వేగంగా అమలు చేయడం కోసం కూటమి ప్రభుత్వం త్వరలో మరో చట్టం తీసుకు రాబోతున్నది.
ఈ 12 ఏళ్ల కాలంలో స్థానిక సంస్థలను దారుణంగా దెబ్బతీశారు. రాజ్యాంగబద్ధ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని అపహాస్యం చేశారు. చట్టబద్ధంగా రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు బదిలీ చేయాల్సినా ఇవ్వలేదు. పైగా స్థానిక సంస్థల ఆదాయాలను రాష్ట్ర ఖజానాకు దారి మళ్ళించి దారుణంగా దెబ్బతీస్తున్నారు.
సంక్షేమం కోసం ఈ రెండేళ్ల కాలంలో రూ. 1.49 లక్షల కోట్లు ఖర్చు చేశామని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం ఎక్కువ భాగం సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని, అభివృద్ధికి నిధులు కొరతగా ఉందనే విష ప్రచారానికి కూడా పూనుకున్నారు.
వాస్తవంగా సంక్షేమం ఖర్చులో 81 శాతం కేవలం సామాజిక పింఛన్లు, ఉచిత విద్యుత్, అమ్మఒడి మూడింటికే ఖర్చు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు కూడా లేకపోతే వీరి విధానాలతో చితికిపోతున్న ప్రజలు తీవ్ర తిరుగుబాటు బాట పడతారు. అందుకే పాలకులు వీటిని ఆర్థిక హక్కులుగా కాకుండా తాత్కాలిక రాజకీయ దోపిడీ ప్రయోజనాలకు అస్త్రాలుగా అమలు చేస్తున్నారు.
టీచర్ పోస్టులు మినహా ఇతర ఖాళీ ఉద్యోగాలను నింపటంలేదు. రూ.6 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల వేతనాలను పెంచటంలేదు. కార్మికుల సంఘటిత, బేరసారాల శక్తిని దెబ్బతీశారు. కార్మికుల వేతనాలు పెరగకుండా అణిచిపెడుతున్నారు. దేశంలో అతి తక్కువ వేతనాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా మార్చేశారు. మెరుగైన వేతన పెంపు, జీవనం, చట్టాల అమలు కోసం కార్మికులు చేసే పోరాటాలు స్థూల ఉత్పత్తికి, వృద్ధి రేటుకి ఆటంకమనే వాదనను ముందుకు తెచ్చి దారుణంగా అణిచివేస్తున్నారు.
స్థూలంగా రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధి రేటు, స్థూల ఉత్పత్తి వల్ల వచ్చే సంపద కింది దాకా ప్రజలకు పునఃపంపిణీ కావటంలేదు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో కొద్దిమంది సంపన్నుల చేతుల్లో పోగుపడుతున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బడా కార్పొరేట్ పెట్టుబడి ఆధిపత్యం పెరుగుతున్నది.
దీనివల్ల ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, పేదరికం, నిరుద్యోగం తగ్గక పోగా ఎక్కువయ్యాయి. అత్యధిక మంది జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రంగా మారుతున్నది. పంటలకు మద్దతు ధర, రక్షణ చర్యలు లేకపోవడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భూములు, ఉపాధి కోల్పోయి పట్టణ వలసబాట పడుతున్నారు. సంఘటిత రంగం తగ్గిపోయి అసంఘటిత కార్మిక రంగం పెరుగుతున్నది. అతి తక్కువ వేతనాలతో ఉపాధి రక్షణ, భద్రత లేని జీవితాలు గడిపే వారి సంఖ్య పెరిగిపోతున్నది. యువత భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చేశారు. ఆదివాసీ గిరిజన, దళిత, మత్స్య, ఇతర సామాజిక తరగతుల ఆర్థిక దుస్థితి, జీవనం ప్రమాదంలో పడుతున్నాయి. స్థానభ్రంశానికి గురవుతున్నారు. చిన్న ఉత్పత్తిదారులు కూడా దారుణంగా దెబ్బతింటున్నారు. పర్యావరణ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ దారుణ పరిస్థితులు తట్టుకోలేక పోరాట బాట పడుతున్న ప్రజలను చీల్చడానికి మత వైషమ్యాలు, ఘర్షణలు పెంచడం, హిందుత్వ మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసే దుర్మార్గ చర్యలకు దిగజారారు. అంతేగాక బరితెగించి పెట్టుబడికి కాపలాదారుడిగా మారి శ్రమజీవులపై క్రూరమైన దాడి సాగిస్తున్నారు.

వ్యాసకర్త: డా.బి.గంగారావు
సెల్: 9490098792







కామెంట్‌లు (0)