గడచిన పదేళ్లలో ప్రపంచ వృద్ధి రేటులో పెద్ద మార్పు లేదు. కానీ అదే సమయంలో కొంత మంది సంపద విపరీతంగా పెరిగింది. ధనవంతుల సంఖ్యలో కూడా అదే తీరు. పేదలు మరింతగా పేదలౌతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? యు.బి.ఎస్ అనే పెద్ద స్విస్ బ్యాంకు 2026 సంవత్సర ప్రపంచ సంపద నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు (వంద కోట్ల డాలర్లు, ప్రస్తుత విలువ ప్రకారం రూ.9,562 కోట్ల 34 లక్షల, 50 వేలు), అంతకు మించి సంపద ఉన్నవారు 2025లో ప్రపంచంలో 3,302 మంది ఉన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 383 మంది (13.1 శాతం) పెరిగారు. వీరిలో వెయ్యి మందికి పైగా అమెరికా, 562 మంది చైనా, 211 మంది మన దేశంలో ఉన్నారు. తరువాత స్థానాల్లో జర్మనీ 193, రష్యాలో 122 మంది తేలారు. సగటున వీరి సంపద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఎన్నో రెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, హంగరీలో పెరుగుదల రేటు రెట్టింపు కాగా, చిలీలో 80, చెక్, మెక్సికోలలో 60, బ్రెజిల్, గ్రీస్‌లలో 50 శాతానికి మించి ఉంది. ఈ వివరాలను 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు వెల్లడైన సమాచారం మేరకు వెలువరించారు. దక్షిణ కొరియాలో ఏడాది కాలంలో బిలియనీర్లు 31 నుంచి 52కు పెరిగారు. అయితే ప్రపంచమంతటా అలాగే ఉందా? కొన్ని దేశాల్లో స్థిరంగా, కొన్ని చోట్ల తగ్గారు. చిలీలో పెరగకపోగా థాయ్‌లాండ్‌లో 25 నుంచి 22కు, సౌదీ అరేబియాలో19 నుంచి 16కు తగ్గారు. గతంలో లక్ష రూపాయల సంపద ఉంటే లక్షాధికారి అని పిలిచారు. ఇప్పుడు వారి స్థానంలో మిలియనీర్లు (కనీసం పది లక్షల ఆదాయం వున్నవారు) వచ్చారు. ఇది కూడా అమెరికన్ డాలర్లలో లెక్క వేస్తున్నారు. ఇలాంటి వారు గతేడాది 1.5 శాతం మంది పెరిగారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే రోజుకు 2,680 మంది కొత్తగా మిలియనీర్లు అయ్యారు.
ప్రపంచంలో అధిక సంపద ఉన్న దేశం అమెరికా అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి జనాలందరూ ధనవంతులా అన్నది అసలు సమస్య. సగటు ఆదాయం, సగటు సంపదకూ, మధ్యగత రాబడి, సంపదకూ తేడా ఉంది. దాన్ని అర్ధం చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికన్లందరూ ఎలన్ మస్క్‌లు కారు. మన దేశంలో అంబానీ, అదానీలు ఎలా ధనవంతులో జనం అందరి స్థితి అది కాదని తెలిసిందే. యు.బి.ఎస్ నివేదిక 30 ధనిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాల గురించి సగటున ఒక వ్యక్తి సంపద ఎంత అని విశ్లేషించింది. ఒక దేశ సంపద విలువను జనాభాతో భాగిస్తే సగటు ఎంతో తెలుస్తుంది. ఒకరి దగ్గర లక్ష, మరొకరి దగ్గర వెయ్యి రూపాయలుంటే సగటు ఇద్దరి రూ.50,500 అవుతుంది. ఈ అంకెలతో రెండవ వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా! ఈ లెక్కన స్విట్జర్లాండ్ సగటు సంపదలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవది. మీడియన్ సంపద (మధ్యగత)ను చూస్తే అదే అమెరికా 28వ స్థానానికి దిగజారింది. మరో మాటలో చెప్పాలంటే 27 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఊరిలో పది మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయనుకుందాం. సగటున చూసినా, మధ్యగతంగా చూసినా వెయ్యి రూపాయలే ఉంటాయి. అంటే సంపద అందరి దగ్గరా సమంగా ఉన్నట్లు. అదే ఊరిలోని మరో పది మందిలో ఒకడి దగ్గర రూ.లక్ష ఉండి తొమ్మిది మంది దగ్గర రూ.వెయ్యి ఉంటే సగటున ఒక్కొక్కరి దగ్గర రూ.10,900 ఉన్నట్లు మధ్యగత సంపద వెయ్యే ఉంటుంది. రెండవదే వాస్తవం. అందుకే సగటు సంపదలో అమెరికా రెండవది, మధ్యగతంలో 28వది. మరికొన్ని వివరాలను చూద్దాం. అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన సంపద విలువ(పట్టిక).
ఎగువన ఉన్న అంకెలు ఏం చెబుతున్నాయి? ‘గినీ గుణకం’ ప్రాతిపదికన 0 నుంచి 100 వరకు పాయింట్లను చూస్తే ఎంత తక్కువ ఉంటే అంతగా అసమానతలు తక్కువగా, ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఎక్కువ ఉన్నట్లు పరిగణిస్తారు. ఇదే విధంగా సగటుతో పోల్చినపుడు మధ్యగత ఎక్కువగా ఉంటే జనాల రాబడి లేదా సంపద ఎక్కువగా ఉన్నట్లు. ఈ వివరాల ప్రకారం చైనాలో కూడా సంపద అసమానతలు ఉన్నాయి. మన దేశం, ఇతర ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే తక్కువగా ‘గిని’ ఉందంటే అర్ధం అసమానతలు తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మనం అగ్ర స్థానంలో ఉన్నాం. అమెరికాలో 77 ఉంది. ప్రజాస్వామిక దేశాలలో ఇంతగా అసమానతలు ఉండటం ఏమిటి ? అక్కడే తొలి ట్రిలియనీర్-ఎలన్ మస్క్ అవతరించాడు. మన నేతలు జిడిపి ని చూపి ‘చూశారా... యుపిఏ హయాం కంటే మేం పెంచాం!’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. జిడిపి అంటే సంపద కాదు, ఒక ఏడాదిలో వస్తువులు, సేవల ద్వారా సృష్టించిన ఉత్పత్తి విలువ. తాము 2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి జిడిపి ని పెంచుతామని మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంది.
‘వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్’ సమాచారం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో 40.1 శాతం సంపద పోగుపడగా రాబడిలో వారి వాటా 22.6 శాతం ఉంది (కొందరి అంచనా మేరకు 2022లో 25 శాతం ఉంది). అమెరికాలో పాతకాలం నాటి రాక్‌ఫెల్లర్, ఫోర్డ్, జెపి మోర్గాన్ వంటి వారిని వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు ఎలా ముందుకు వచ్చారో మన దేశంలో టాటా, బిర్లా, గోయంకాలను దాటి అంబానీలు, అదానీలు దూసుకుపోవటాన్ని మనం చూడవచ్చు.
ప్రపంచంలో ఆదాయ అసమానతల పెరుగుదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అమెరికాలో 2025 వివరాలను చూసినపుడు ఒక కంపెనీ సిఇఓ-కార్మికుడి వేతన వ్యత్యాసం ఆకాశానికి అంటినట్లు తేలింది. టెస్లా కంపెనీలో ఒక కార్మికుడి మధ్యగత ఆదాయం కంటే దాని అధిపతి ఎలన్ మస్క్‌కు 25 లక్షల రెట్లు ఉందన్నది నమ్మలేని నిజం. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎ.ఎఫ్.ఎల్-సిఐఓ వార్షిక వేతన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 500 కంపెనీల జాబితాను పరిశీలించినపుడు మధ్యగత వేతనంతో పోల్చితే ఉన్నతాధికారులకు 285 రెట్లు అదనంగా ఇస్తున్నారు. ఇదే కంపెనీల సిఇఓల వేతనం 1,700 శాతం ఎక్కువ. ఈ వ్యత్యాసం అన్ని రంగాలలో ఒకే విధంగా లేదు. ఉత్పాదక రంగంలో ఏడాదికి సగటున ఒక సిఇఓ 69.6 కోట్ల డాలర్లు పొందుతుండగా కార్మికుడు 93 వేల డాలర్లు మాత్రమే తీసుకుంటున్నాడు. స్టాక్‌మార్కెట్‌లో మన కార్పొరేట్, పెద్ద కంపెనీల సిఇఓల వేతనం సాధారణ కార్మికుడి మధ్యగత వేతనం కంటే రెండు వందల రెట్లు ఎక్కువ, అమెరికా తరువాత అంత తేడా ఉన్న ఘనత మనదే, ఎటువైపు పయనిస్తున్నట్లు!

ఎం. కోటేశ్వరరావు







కామెంట్‌లు (0)