ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం రూ.38 కోట్ల అదనపు చెల్లింపు

07 ఆగస్టు, 2026

sas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 11:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- క్వాంటం వ్యాలీ భవనాలకు రూ.1002 కోట్లు

- అమరావతి ఐ వీల్‌‌కు స్థలం పెంపు

- ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో మార్పులు, కన్సల్టెంట్ల నియమాకం కోసం ఫాస్టర్స్‌ ‌పార్టనర్స్‌‌కు అదనంగా రూ.38,18 కోట్లు చెల్లించేందుక పట్టణాభివృద్ది శాఖ ఆమోదం తెలిపింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సిఆర్‌‌డిఏ అథారిటీ 64వ సమావేశంలో 682వ తీర్మానంపై తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో హైకోర్టు బిల్డింగ్ బిల్ట్ అప్ విస్తీర్ణం పెరగడంవల్ల కన్సల్టెన్సీ పరిధి పెరిగిందని తెలిపారు. అలాగే అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ల నియామకం కోసం సవరించిన ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం కాంట్రాక్ట్‌లో మారకపు రేటు వ్యత్యాసం, జీఎస్టీ కోసం అదనపు బడ్జెట్ కేటాయింపు చేసినట్లు తెలిపారు. ఫాస్టర్ + పార్ట్‌నర్స్ లిమిటెడ్ కంపెనీకి చెల్లించాల్సిన కాంట్రాక్టు బాధ్యతపై మారకపు రేటు ₹109 నుండి ₹128.215కి పెరిగిందని అందువల్ల రూ.3.67 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా విదేశీ మారకద్రవ్య వ్యత్యాసం కలిపి జీఎస్టీ కాకుండా అదనంగా రూ.38.18 కోట్ల భారం పడుతుందని వివరించారు. ఈ మొత్తాన్ని కలపడం ద్వారా రూ.175.08 కోట్ల నుండి రూ.206.59 కోట్లు అవుతుందని జిఓలో పేర్కొన్నారు.

క్వాంటం టవర్ల కోసం రూ.1002 కోట్లు

ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా ట్విన్ ఆఫీస్ టవర్స్ నిర్మాణం కోసం ఎల్‌అండ్‌‌టికి పనులు అప్పగించారు. దీనికోసం రూ.1002 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవ అంచనా వ్యయం రూ.958.40 కోట్లని 4.60 శాతం ఎక్కువకు కేటాయించడం వల్ల వ్యయం పెరిగిందని పేర్కొన్నారు.

అమరావతి ఐకి భూ కేటాయింపులు పెంపు

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన అమరావతిలో చేపట్టనున్న "అమరావతి ఐ (అబ్జర్వేషన్ వీల్) అభివృద్ధి" కోసం భూ కేటాయింపులను పెంచారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఎక్కువ వ్యాసం కలిగిన అబ్జర్వేషన్ వీల్స్‌ను ఎంచుకునే బిడ్డర్లకు అదనపు భూమి కేటాయింపుతో రీ-టెండర్ పిలవడానికి ఎజిఐసిఎల్‌‌కు అనుమతి ఇచ్చారు. గరిష్టంగా 10 ఎకరాల పరిమితికి లోబడి అవసరమైనంత అదనపు భూమిని కేటాయించాలని నిర్ణయించారు.

128 మీటర్ల నుండి 175 మీటర్ల కంటే తక్కువ వ్యాసం ఉన్న వీల్ల్‌‌కు ఆరు ఎకరాలు, 175 మీటర్ల నుండి 200 మీటర్ల కంటే తక్కువ వ్యాసం ఉన్న వీల్‌‌కు ఎనిమిది ఎకరాలు 200 మీటర్ల నుండి 250 మీటర్ల వరకు వ్యాసం ఉన్న వీల్‌‌కు తొమ్మిది ఎకరాలు 250 మీటర్లు అంతకంటే ఎక్కువ వ్యాసం ఉన్న వీల్‌‌కు పది ఎకరాలు కేటాయించవచ్చని తెలిపారు. దీనిలో సగం వీల్‌‌కోసం సగం వాణిజ్య అవసరాల కోసం వాడుకోవచ్చని తెలిపారు. ఈ పద్ధతిలో ఇప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి అవసరమైతే కొత్త టెండర్లు పిలవడానికి అవకాశం కల్పించినట్లు జిఓలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్