టిటిడి పాలకమండలిలో తీర్మానాలు
ప్రజాశక్తి- తిరుమల : తిరుమల శ్రీవారి యాత్రికుల భద్రతకు, టిటిడి ఉద్యోగుల భద్రతకు టిటిడి ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సాధించింది. తిరుమల కొండపై ఏదైనా ప్రమాదవశాత్తు యాత్రికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు అందజేయాలని తీర్మానించింది. ఈ విధానం అమలుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)తో ఏటా మూడు కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది. అన్నమయ్య భవనంలో టిటిడి పాలకమండలి బుధవారం సమావేశమైంది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వివరించారు. దేశంలో మొట్టమొదటిసారి ఎల్ఐసి ద్వారా యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ మొత్తం అందనుంది. అలాగే సిపిఎస్, ఎన్పిఎస్ పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఇహెచ్ఎఫ్ సౌకర్యం కల్పిస్తూ రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం లభించింది. ఐఒసిఎల్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో జిపిఎస్ రెన్యువబుల్‌కు ఆమోదం తెలిపారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ వర్కర్ పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపారు. టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు ఇవ్వనున్నారు. ఇందుకుగాను మూడు సంవత్సరాలకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. తిరుమలలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూ, వడ ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టిటిడి భవనం లైసెన్సు గడువు మరో మూడేళ్లు పొడిగించారు.







కామెంట్‌లు (0)