ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు మరియం ధావలే
ముగిసిన ఐద్వా అకడమిక్, సాంస్కృతిక ఉత్సవాలు
విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్‌లు అందజేత
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విద్యార్థులు, మహిళలందరూ కలిసి మెరుగైన సమాజ నిర్మాణం కోసం పోరాడదామని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు మరియం ధావలే, కోశాధికారి పుణ్యవతి కోరారు. ఐద్వా జాతీయ సమావేశాల సందర్భంగా విజయవాడ ఎంబివికెలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అకడమిక్, సాంస్కృతిక ఉత్సవాలు బుధవారం అట్టహసంగా ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత చూపించిన శక్తి, ఉత్సాహం మరెవరికీ సాధ్యం కాదన్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేది జెన్ జీ తరమేనన్నారు. రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, అభ్యుదయ భావాలను కాపాడుకునేందుకు యువత కదలి రావాలని కోరారు. విద్యార్థులు తమ నృత్యాల కోసం ఎంచుకున్న ఇతివృత్తాలు నేటి సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు, సమస్యలకు అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్‌లు అందజేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, చొరవ చూపిన నిర్వాహకులకు ఐద్వా కేంద్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలకు దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాల నుంచి నాయకులు, ప్రతినిధులు తరలిస్తున్నారని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకులు సర్వాణి, ఐద్వా రాష్ర్ట పూర్వ కార్యదర్శి డి.రమాదేవి, రాష్ర్ట కార్యదర్శి సావిత్రి, అధ్యక్షులు శ్రీదేవి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)