కెసిఆర్ ఫాంహౌస్ వద్ద ఘటనపై దళితుల ఆందోళన
సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ సిఎం ఆదేశం
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఫాంహౌస్ వద్ద దళితులు ఆందోళన చేయగా..ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారన్న కథనాలు దుమారం రేపాయి. ఎర్రవెల్లిలోని కెసిఆర్ ఫాం హౌస్ వద్ద మంగళవారం దళితులు డప్పులతో నిరసన తెలిపారు. ఈ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దళితులకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నేతల తీరుపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటనతో ముడిపడిన అంశాలపై అటు బిఆర్‌ఎస్ నాయకులు, ఇటు మంత్రులు లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి పరస్పరం ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న పరిణామాలపైనా, కెసిఆర్ ఫాం హౌస్ వద్ద శుద్ధీకరణపైనా సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కులవివక్ష, అణచివేతను తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన అన్నారు. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని దళితులు డప్పులతో డిమాండ్ చేస్తే... కెసిఆర్ మరో కుట్రకు ఆదేశించారని అన్నారు. సంధ్యారావు అనే నాయకురాలికి చెప్పి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయించారని తెలిపారు. కెసిఆర్ ఆదేశాల మేరకే శుద్ధి చేశామని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌ను చూపించారు. ‘శుద్ధి చేయాల్సింది నేలను కాదు... తరతరాలుగా వాళ్ల మనసుల్లో ఉన్న కుళ్లు, అంతరాలను శుద్ధి చేయాలి. దళితులు నడిచారని నేలను శుద్ధి చేయించిన దొర అహంకారాన్ని శుద్ధి చేయాలి. దళితులను అవమానించిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షిస్తాం’ అని సిఎం ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఫాంహౌస్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మైల పడిందని పసుపు నీళ్లు చల్లారా? అంటూ ప్రశ్నించారు. ఫ్యూడల్, వివక్షపూరిత భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సమాజం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. దళితులు నడిచారని రోడ్డును శుద్ధి చేయడం దారుణమైన ఘటన అని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అస్పృశ్యత విధానం ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని, దళితులను అవమానించడమే బిఆర్‌ఎస్, బిజెపి భావజాలమని మంత్రి సీతక్క విమర్శించారు. ఎస్సీలను బిఆర్‌ఎస్ పార్టీ అవమానిస్తోందని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)