బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయవాదుల పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన ఐలు

1 గంట క్రితం

ailu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కాకినాడ : న్యాయవాదుల పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ కాకినాడ బార్ అసోసియేషన్ (ఐలు) ఖండించింది. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై చట్టవిరుద్ధంగా రౌడీషీట్ తెరవాలనే పోలీసుల ప్రయత్నాన్ని విరమించుకోవాలని, న్యాయవాది సుభానిపై పెట్టిన అక్రమ కేసును, అలాగే న్యాయవాది పలగాని రవిపై సివిల్ వివాదానికి సంబంధించి పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఐలు బుధవారం కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మేడపాటి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం బెజివాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి, ఎంజి రోడ్డులోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడానికి ప్రదర్శనగా వెళుతున్న బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులపై, ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై పోలీసులు చేసిన దౌర్జన్యం అప్రజాస్వామికం అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం పోలీసులకు లేదని, న్యాయవాదుల శాంతియుత ఆందోళనను అణచివేయడానికి రోప్ పార్టీలతో నిర్బంధానికి పాల్పడటాన్ని ఐలు తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. న్యాయవాదులు , పోలీసులు సంయమనంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందన్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులు న్యాయవాదులపై చేసిన దౌర్జన్యాన్ని ఐలు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐలు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఐలు జిల్లా, నగర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చే వరకు ఐలు పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐలు, కాకినాడ బార్ వైస్ ప్రెసిడెంట్ పి రామచంద్రరాజు, ట్రెజరర్ బహుదూర్ షా వెంకటరెడ్డి,సీనియర్ న్యాయవాదులు మహ్మద్ జవహర్ ఆలీ, ఇజాజుద్దీన్,హరిగ్రీవరావు, పి శ్రీనివాస్ , ఐలు కాకినాడ సిటీ కార్యదర్శి కె నాగజ్యోతి, దేశీ, టి రమాదేవి, దమయంతి, వీరలక్ష్మి, వరలక్ష్మి, పి శ్రీదేవి, మహాలక్ష్మి, దుర్గ ప్రసాద్, చంద్రశేఖర్, వి శ్రీనివాస్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్