-సన్ రే రిసార్ట్ వద్ద ఎస్కట్ హోటల్ (దుబాయ్)కి 1500 గజాలు
-ఇప్పటికే అన్నవరంలో ఒబెరాయ్‌కి 40 ఎకరాలు
-రుషికొండ భవనాలు సహా స్థలాలు లీజుకు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ప్రభుత్వ సంపదను, ప్రజలకు చెందిన పర్యాటక ప్రాంతాలను ప్రై‘వేటు’ వారికి ధారాదత్తం చేసే పనిలో ఎపి టూరిజం శాఖ నిమగ్నమైంది. రాష్ర్టంలోని టిడిపి కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా దిశానిర్దేశం చేస్తోంది. ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే రుషికొండలోని 9.8 ఎకరాల భవనాలను (గార్డెన్స్, రోడ్లు, వాక్ వేలు, పార్కింగ్ స్థలాలు సహా), దిగువునగల 1200 చదరపు మీటర్ల ఖాళీ భూమిని ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ)కి ఆహ్వానించింది. నాలుగు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపినట్లు ఎపి టూరిజం అధికారులు ‘ప్రజాశక్తి’కి తెలిపారు. మొత్తంగా రుషికొండ చుట్టూగల సుమారు 45 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లు తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
దుబాయ్ కంపెనీకి 1500 గజాల స్థలం తాజాగా సాగర్‌నగర్ తీరానికి అభిముఖంగా సన్ రే రిసార్ట్ వద్ద రోడ్డుకు ఎడమ వైపునగల 1,500 గజాల స్థలాన్ని దుబాయ్‌కి చెందిన ఎస్కట్ హోటల్‌కు ఎపి టూరిజం అధికారులు కట్టబెట్టడంతో ఆ ప్రాంతాన్ని సంబంధిత ఇంజనీర్లు గురు, శుక్రవారాల్లో పరిశీలించారు. రూ.వందల కోట్ల విలువైన స్థలమిది. దీన్నిప్పుడు చదును చేసి సిద్ధంగా ఉంచారు. ఇటీవలే జివిఎంసి ఇక్కడ సాగర తీరం నుంచి ఈ స్థలం పక్కగా సన్ రే రిసార్ట్‌కు సుందరమైన రోడ్డును నిర్మించింది. భీమిలి దగ్గర అన్నవరంలో ఒబెరాయ్ గ్రూపునకు 40 ఎకరాలు, సాగర్‌నగర్ సమీప కొండపై మూడు ఎకరాలను పివిఆర్ హోటల్స్‌కు, భీమిలికి సమీపంలోని కొత్తవలస దగ్గర 15 ఎకరాలను మైరా రిసార్ట్స్‌కు ఎపి టూరిజం శాఖ ఇప్పటికే కట్టబెట్టింది. ఒబెరాయ్ హోటల్ వద్ద మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో మరో ప్రైవేట్ సంస్థ మే సైడ్‌కి 40 ఎకరాలు ఇచ్చారు. మిగతా అన్నిచోట్లా భూమి పూజ చేసుకుని స్థలాలను తమ గుప్పిట్లో యాజమాన్యాలు పెట్టుకున్నాయి. ఎపి టూరిజం సంస్థకు చెందిన స్థలాలు విశాఖలో పలుచోట్ల కోర్టుల్లో ఉండడంతో వాటిని ఇంకా ప్రైవేట్‌కు ఇవ్వలేదని సదరు అధికారులు తెలిపారు.







కామెంట్‌లు (0)