- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్.శర్మ లేఖ
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : గూగుల్ - రైడెన్ - అదాని డేటా సెంటర్లకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విలువైన భూములను తక్కువ ధరలకు కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ప్రైవేటు సంస్థలకు మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కేటాయించడం అవినీతి నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన రాజకీయ నాయకులు, ఉన్నతాధి కారులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు లేఖ రాశారు. ‘గూగుల్ - రైడెన్ - అదాని డేటా సెంటర్లకు ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పించింది. స్థానిక ప్రజలతో తగిన సంప్రదింపులు జరపకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పరిశ్రమల శాఖ జారీ చేసిన జిఒఎంఎస్ నెంబర్ 213, ఈ నెల 20న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా విశాఖ నగరం అడివివరంలో ఇప్పటికే కేటాయించిన 160 ఎకరాలకు అదనంగా మరో 5.84 ఎకరాలను కేటాయించారు. రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జిఒఎంఎస్ నెంబర్ 571 ప్రకారం ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించే సందర్భంలో మార్కెట్ విలువ ఆధారంగా లీజు రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. ఏటా పది శాతం లీజు రెంటల్, అనంతరం ఐదు శాతం వార్షిక పెంపు ఉండాలని నిబంధనలు చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ విలువల ప్రకారం అడివివరంలో ఎకరం భూమి మార్కెట్ విలువ సుమారు రూ.20 కోట్లు. నిబంధనల ప్రకారం ఎకరానికి ఏడాదికి రూ.2 కోట్ల వరకు లీజు రుసుము రావాలి. తక్కువ లీజు రేట్లకు భూములను కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు భారీగా ఆర్థిక నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతోంది.
తర్లువాడ, రాంబిల్లి, అడివివరం ప్రాంతాల్లో గూగుల్ - రైడెన్ - అదాని సంస్థలకు 600 ఎకరాలకుపైగా భూములను మార్కెట్ ధరపై 25 శాతం వరకు రాయితీతో కేటాయించారు. ఎకరం భూమి మార్కెట్ విలువ తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు రూ.2 కోట్లు, అడివివరంలో సుమారు రూ.20 కోట్లు. విలువైన ప్రభుత్వ భూముల ధరలను ఇష్టానుసారంగా తగ్గించి ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం కల్పించడం సరికాదు’ అని ఈ లేఖలో శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకు కేటాయించిన అంశాలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. బొగ్గు గనులు, 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారాల్లో ప్రజా ఆస్తుల కేటాయింపులో పారదర్శకత, ప్రజాప్రయోజనం, సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఉండాలని న్యాయస్థానాలు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.








కామెంట్‌లు (0)