గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజధాని నిర్మాణానికి సలహాలు, సూచనల కోసం ‘అమరావతి అభివృద్ధి సలహా మండలి’

2 గంటల క్రితం

jac
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జెఎసి నాయకుల ప్రకటన

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అమరావతి పరిరక్షణ కోసం ఏర్పాటైన జెఎసిలన్నింటినీ తీసివేసి కొత్తగా అమరావతి అభివృద్ధి సలహా మండలిని త్వరలో ఏర్పాటు చేస్తామని జెఎసి నాయకులు ప్రకటించారు. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి తీసుకోబోమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో గురువారం అమరావతి జెఎసి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతు పువ్వాడ సుధాకరరావు మాట్లాడుతూ.. రాజధాని అభివృద్ధి శరవేగంగా జరిగేందుకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అమరావతి అభివృద్ధి సలహా మండలిని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. అమరావతి అభివృద్ధి సలహా మండలిలో రాజధానిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, మహిళలు, రాజకీయ పార్టీలకు తగు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామన్నారు. జెఎసిలో కొంతమంది సిఆర్‌డిఎ అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని గ్రామాలు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. ఇంకోవైపు జగన్‌మోహన్‌రెడ్డి మావిగన్ అంటూ విధ్వంసకర విధానాలను తెరపైకి తెస్తున్న నేపథ్యంలో అమరావతి నిర్మాణం శరవేగంగా జరిగేందుకు అవసరమైన తోడ్పాటు, సూచనలు ఇచ్చేందుకు అమరావతి అభివృద్ధి సలహా మండలి ఏర్పాటు అవసరమని భావించామని వివరించారు. రాజధానిలో గ్రామకంఠాలు, రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధిపోట్లు, ఆర్-1 జోన్ లలో స్థలాల కోసం తొందరపడి భూసేకరణ అమలు చేయడం, కౌలు, అమరావతి పింఛన్‌ చెల్లింపు ముగిసే నాటికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన, ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) పెంపుపై రైతులకు అవగాహన తదితర అంశాలపై ప్రభుత్వానికి, సిఆర్‌‌డిఎకు మండలి సహకరిస్తుందన్నారు. కురగల్లుకు చెందిన రామరాజు అనే రైతు మాట్లాడుతూ.. గతంలో ఏర్పాటు చేసిన సమితి, సమైక్య కమిటీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రామ కన్వీనర్లు, డైరెక్టర్లు వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయిందన్నారు.

ఉద్ధండరాయునిపాలేనికి చెందిన రైతు బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారమేమీ లేకుండా కమిటీల ఏర్పాటు వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఆనంతవరానికి చెందిన నన్నపనేని రామరావు మాట్లాడుతూ... ఆర్-1జోన్‌‌లోని తన స్థలం సమస్యను ప్రస్తావిస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని అంటున్నారని, ఎన్నికలప్పుడు పార్టీ గెలుపునకు కష్టపడ్డామని, మళ్లీ కష్టపడతామని, అయితే పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకోవాలా? అని ఆక్షేపణ వ్యక్తం చేశారు. సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్