జాతీయ స్థాయిలో 127వ ర్యాంకు సాధన
హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, అధ్యాపక బృందం
ప్రజాశక్తి - అనంతపురం : భారతదేశంలో 'ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్' (IIRF) విడుదల చేసిన వైద్య కళాశాలల జాతీయ ర్యాంకింగ్స్‌లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 823 మెడికల్ కళాశాలలను పరిశీలించగా, వాటిలో అత్య అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 144 టాప్ కళాశాలలకు మాత్రమే స్థానం కల్పించారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చోటు దక్కించుకున్న 7 ప్రముఖ వైద్య కళాశాలల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల జాతీయ స్థాయిలో 127వ ర్యాంకు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది.
ప్రభుత్వ వైద్య రంగంలో ఈ స్థాయి ర్యాంకు లభించడం స్థానిక సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల వర్గాలకు ఎంతో గర్వకారణమని అధికారులు తెలిపారు. ఈ విజయం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం. విజయశ్రీ, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ మల్లేశ్వరి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బెనెడిక్ట కోయిలలు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల పురోగతికి బాటలు వేసిన పూర్వ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, బోధన-బోధనేతర సిబ్బంది, ఆసుపత్రి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఘనత పట్ల స్థానిక విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాసంఘాలు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ర్యాంకింగ్‌లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ఐఐఆర్‌ఎఫ్ ప్రకటించిన టాప్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానం పొందిన కళాశాలల వివరాలు:
కళాశాల పేరుజాతీయ ర్యాంకు
ఆంధ్ర వైద్య కళాశాల (విశాఖపట్నం)13
గుంటూరు వైద్య కళాశాల (గుంటూరు)50
కర్నూలు మెడికల్ కళాశాల (కర్నూలు)57
రంగరాయ వైద్య కళాశాల(కాకినాడ)59
శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల (తిరుపతి)69
సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ)109
ప్రభుత్వ వైద్య కళాశాల (అనంతపురం)127








కామెంట్‌లు (0)