ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : డిఎస్‌సి పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని, వారి ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందని మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజలతో కలిసి వైసిపి విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలన్నీ విజయవంతమయ్యాయని మంగళవారం ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. డిఎస్‌సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని గొంతెత్తారని తెలిపారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం ఈ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డిఎస్‌సిలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసిందని, సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా సిఎం చంద్రబాబు గానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గానీ ఇప్పటి వరకూ వాటిమీద నోరు మెదపలేదని తెలిపారు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. యువత డిమాండ్లను సాధించే క్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
3,50,000 మంది డిఎస్‌సి అభ్యర్థులకు అన్యాయం : పుత్తా
డిఎస్‌సిలో 3,50,000 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తెలిపారు. రెండు నెలలుగా డిఎస్‌సిలో జరిగిన అవకతవకలపై వైసిపి నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్ జగన్ 100 ప్రశ్నలు ఆధారాలతో సహా ప్రశ్నించినా ఒక్క మంత్రి కూడా స్పందించలేదని అన్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే లోకేష్ రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప ఆధారాలు చూపించలేకపోతున్నారని తెలిపారు.








కామెంట్‌లు (0)