రేపు ల్యాండ్ ఓనర్లకే అన్నదాతా సాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి రైతులకు ప్రతి ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ టిడిపి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీ ‘అన్నదాతా సుఖీభవ’.. కౌలు రైతులకు మూడవ సంవత్సరం కూడా అమలు చేయట్లేదు. సొంత భూమి కలిగిన రైతులకు పిఎం కిసాన్‌తో కలిపి అన్నదాతా... ఈ ఏడాది తొలి కిస్తు జూన్ 20న (శనివారం) జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం పిఎం కిసాన్ కిస్తు ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజునే రాష్ట్రం వాటా అన్నదాతా... కిస్తును కలిపి ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం నిర్ణయం. శనివారంనాడు ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్‌లో పిఎం కిసాన్ కిస్తు రూ.2 వేలు విడుదల చేస్తున్నారు. దాంతో అదే రోజున పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతా.. వాటా రూ.5 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సుమారు 46 లక్షల మందికి అన్నదాతా.. సాయం జమ అవుతుండగా, పిఎం కిసాన్ కిస్తు మాత్రం 39 లక్షల మందికే పడుతుంది. కాగా కౌలు రైతులకు పిఎం కిసాన్ లేనందున రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రూ.20 వేల సాయాన్ని ఇస్తుందని గతంలో పేర్కొన్నారు. అన్నదాతా... పథకాన్ని కూటమి సర్కార్ వచ్చాక తొలేడాది (2024-25)లో అమలు చేయలేదు. రెండవ ఏట (2025-26)లో మూడు విడతల్లో సాయం అందించేలా పథకాన్ని డిజైన్ చేసి ప్రారంభించినప్పటికీ కేవలం ల్యాండ్ ఓనర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఖరీఫ్ సీజన్‌లో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని, కొంచెం సమయం చూసుకొని వారికి సాయం విడుదల చేస్తామన్నారు. 2025-26లో కౌలు రైతులకు సాయం చేయకుండా మొండి చెయ్యి చూపించారు. కూటమి సర్కార్ మూడవ సంవత్సరంలోనైనా తమకు సాయం చేస్తుందని కౌలు రైతులు ఆశగా ఎదురు చూస్తుండగా శనివారం విడుదల చేసే సాయం కేవలం స్వంత భూమి కలిగిన వారికే పరిమితం చేస్తూ అంతర్గతంగా నిర్ధారించారు. ఈ ఖరీఫ్‌లో కౌలు రైతుల గుర్తింపు పూర్తయ్యాక, అక్టోబర్‌లో ల్యాండ్ ఓనర్లకు రెండవ కిస్తు వేసే సమయంలో కౌలు రైతులకు సాయం అందించే విషయం ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో ఉందంటున్నారు. వైసిపి తెచ్చిన కౌలు చట్టం స్థానంలో సులభతరంగా కొత్త చట్టం తెస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ హామీని అటకెక్కించింది. ఉనికిలో ఉన్న సిసిఆర్‌సి చట్టం పరిధిలోనైనా గుర్తింపు కార్డులిచ్చి కౌలు రైతులకు సాయం చేయకుండా వాయిదా వేసింది.









కామెంట్‌లు (0)