- వైద్య ఆరోగ్య శాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాముకాటు బాధితులకు ఆసుపత్రికి చేరుకునేలోపే అత్యవసర చికిత్స అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ 108 వాహనాల్లోనే యాంటీ స్నేక్ వీనం అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ మందును అంబులెన్స్‌లోని అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు తమంతట తాముగా ఇవ్వరు. మంగళగిరి అత్యవసర స్పందన కేంద్రంలోని వైద్యుడి సూచన మేరకే వినియోగిస్తారని ఆ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 2025 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3,104 పాముకాటు అత్యవసర కాల్స్ నమోదైన నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఇప్పటికే కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు పాముకాటు బాధితులకు అంబులెన్స్‌లోనే విరుగుడు మందు అందించి ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపింది. పాముకాటు బాధితుడిలో విషప్రభావం శరీరమంతా వ్యాపిస్తున్నట్లు అనుమానించే లక్షణాలు కనిపిస్తే ఈఎంటీ వెంటనే అత్యవసర స్పందన కేంద్రం వైద్యుడిని సంప్రదిస్తారు. అంబులెన్స్‌లోని డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైతే యాంటీ స్నేక్ వీనం ఇవ్వాలని సూచిస్తారు. వైద్యుడి సూచన మేరకే ఈఎంటీ మందును వినియోగిస్తారు. కనురెప్పలు వాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, మింగడంలో ఇబ్బంది, మాట తడబడటం, రక్తం గడ్డకట్టకపోవడం, అసాధారణ రక్తస్రావం, వేగంగా వాపు రావడం, బొబ్బలు లేదా తీవ్రమైన కణజాల నష్టం వంటి లక్షణాలు కనిపిస్తే విషప్రభావాన్ని అనుమానిస్తారు.
విషం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందా లేదా తెలుసుకునేందుకు 20 నిమిషాల రక్త గడ్డకట్టే పరీక్షను నిర్వహిస్తారు. రక్తం 20 నిమిషాల తర్వాత కూడా గడ్డకట్టకపోతే దాన్ని విషప్రభావానికి సూచనగా పరిగణించి, వివరాలను అత్యవసర స్పందన కేంద్రం వైద్యుడికి తెలియజేస్తారు.








కామెంట్‌లు (0)