ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాల బట్వాడా నుంచి.. ఆర్థిక భరోసా వరకు..

1 గంట క్రితం

40960dd14e4f920e62e113ea614eef37.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 06:52 పూర్వాహ్నం | 11 నిమిషాల చదవడం

​అక్టోబర్‌ 10న ప్రపంచ తపాలా దినోత్సవం

ఉత్తరం అంటే ఒక అనుబంధం.. కేవలం సమాచారం కాదు.. అది ఒక భావోద్వేగం. తల్లికి కొడుకు, తండ్రికి కూతురు, ఉద్యోగం కోసం దూరంగా వెళ్లిన భర్త నుంచి భార్యకు వచ్చిన ఉత్తరం. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుడి నుంచి ఇంటికి వచ్చేది. ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థికి నియామకం రూపంలో.. విదేశాల్లో ఉన్న బంధువు పంపిన శుభవార్త. ఒక్కో ఉత్తరం వెనుక ఒక్కో కుటుంబ కథ ఉండేది. పోస్టుమ్యాన్‌ ఇంటి గుమ్మం తొక్కగానే అతను కేవలం ఒక కవరు ఇవ్వడం కాదు.. ఎవరో ఒకరి మనసును తీసుకొచ్చేవాడు. అందుకే పోస్టుమ్యాన్‌ ఒక కుటుంబానికి తెలిసిన వ్యక్తి. గ్రామంలో ప్రతి ఇంటి చిరునామా తెలిసిన మనిషి. ఎవరి కొడుకు ఎక్కడ ఉన్నాడో.. ఎవరి కుమార్తె ఎక్కడ చదువుతోందో.. ఎవరి ఇంటికి ఏ ఉత్తరం రావచ్చో తెలిసిన వ్యక్తి. అతని సైకిల్‌ గంట ఒకప్పుడు వార్తకు సంకేతం.


ఒకప్పుడు పోస్టుమ్యాన్‌ సైకిల్‌ కనిపిస్తే చాలు.. ఇంటి గడపకు ఏదో ఒక సందేశం వచ్చిందనే ఆనందం. దూరాన ఉన్న ఆత్మీయుల నుంచి వచ్చిన ఉత్తరం కోసం రోజుల తరబడి ఎదురుచూపులు. మనసులోని మాటలను కాగితంపై రాసి తపాలా పెట్టెలో వేయడం. పండుగ శుభాకాంక్షలు, ఉద్యోగ నియామక ఉత్తరాలు, పరీక్షా ఫలితాలు, బంధువుల కబుర్లు.. ఇలా ఒకప్పుడు ప్రతి కుటుంబ జీవితంలోనూ తపాలా ఒక విడదీయరాని భాగంగా ఉండేది. కాలం మారింది.. ఉత్తరాల స్థానాన్ని మొబైల్‌ సందేశాలు ఆక్రమించాయి. క్షణాల్లో సమాచారం చేరుతోంది. వీడియో కాల్స్‌తో దూరాలు చెరిగిపోతున్నాయి. అయినా పోస్టాఫీసు ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ఉత్తరాలు, మనియార్డర్లు, పార్శిళ్లతో మొదలైన ప్రయాణం నేడు పొదుపు, బీమా, బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, పార్శిల్‌–లాజిస్టిక్స్‌ వంటి అనేక రంగాలకు విస్తరించింది. ఒకప్పుడు చేతిలో ఉత్తరం పెట్టిన పోస్టుమ్యాన్‌.. నేడు ప్రజల ఆర్థిక జీవితంలోనూ భాగస్వామిగా మారాడు. చిన్న మొత్తాల పొదుపు నుంచి బాలిక భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి వరకు.. వృద్ధుల పొదుపు నుంచి జీవిత బీమా వరకు.. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సేవల నుంచి డిజిటల్‌ లావాదేవీల వరకు పోస్టాఫీసు తన పాత్రను విస్తరించుకుంటూ వచ్చింది.

067de4f7cf8c6d6114482d7954da9bc4.jpg

ఇలా ఏర్పడింది...

నాటి దూతల వ్యవస్థ నుంచి నేటి డిజిటల్‌ పోస్టాఫీసు వరకు సాగిన ఈ పరిణామ క్రమాన్ని, ప్రజలకు అందుతున్న పొదుపు-బీమా సేవలను ఒకసారి పరిశీలిద్దాం. మనుషులు ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేరవేసుకోవాలన్న అవసరం ఉన్నంత కాలం తపాలా వ్యవస్థకు చరిత్ర ఉంది. రాజులు, చక్రవర్తుల కాలంలో గుర్రపు స్వారీలు, కాలినడక దూతల ద్వారా సందేశాలు చేరేవి. కాలక్రమంలో ఈ దూత వ్యవస్థలు క్రమబద్ధమైన తపాలా వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి. అంతర్జాతీయ తపాలా వ్యవస్థలో 1874 కీలకమైన మలుపు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 22 దేశాల ప్రతినిధులు సమావేశమై, అంతర్జాతీయ తపాలా సహకారానికి పునాది వేశారు. 1874 అక్టోబర్‌ 9న జరిగిన ఒప్పందంతో జనరల్‌ పోస్టల్‌ యూనియన్‌ ఏర్పడింది. 1878లో అది యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌గా మారింది. అదే అక్టోబర్‌ 9న ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశాల మధ్య ఉత్తరాలు, పార్శిళ్ల రాకపోకలను సులభతరం చేయడం, తపాలా సేవలకు అంతర్జాతీయ సహకార వ్యవస్థను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.

మనదేశంలో..

మనదేశంలో తపాలా వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వివిధ రాజవంశాల కాలంలో సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు దూత వ్యవస్థలు ఉండేవి. ఆ కాలంలో రహదారుల వెంట గుర్రపు తపాలా వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించారు. బ్రిటీష్‌ పాలనా కాలంలో ఆధునిక పోస్టల్‌ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. 1774లో కలకత్తా జనరల్‌ పోస్టాఫీసు ప్రారంభమైంది. అనంతరం మద్రాస్‌, బొంబాయి వంటి ప్రధాన నగరాల్లో పోస్టాఫీసులు ఏర్పడ్డాయి. 1876లో భారతదేశం యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌లో చేరింది. పోస్టుకార్డు, రైల్వే మెయిల్‌ సర్వీసు, మనియార్డర్‌ వంటి సేవలు క్రమంగా విస్తరించాయి. ఇక్కడి నుంచే పోస్టాఫీసు పాత్ర కేవలం ఉత్తరాల బట్వాడాను దాటి ప్రజల ఆర్థిక జీవితంలోకి ప్రవేశించింది.

పొదుపుకు శ్రీకారం

భారత పోస్టల్‌ చరిత్రలో 1882 ఒక ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ప్రారంభమైంది. ప్రజలు తమ చిన్న మొత్తాలను భద్రంగా దాచుకోవడానికి పోస్టాఫీసును ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించిన పోస్టాఫీసు నెట్‌వర్క్‌ వల్ల పొదుపు అలవాటును ప్రజల్లో పెంచడానికి ఇది దోహదపడింది. అంటే పోస్టాఫీసు కేవలం ‘సందేశాల వాహకుడు’గానే కాకుండా ‘పొదుపుకు భరోసా’గా మారడం అప్పుడే ప్రారంభమైంది.

podupu.jpg

బీమా రంగంలో మరో అడుగు

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 1884 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. తొలుత తపాలా శాఖ ఉద్యోగుల కోసం రూపొందించిన ఈ బీమా పథకం తరువాత ఇతర అర్హత కలిగిన ఉద్యోగ వర్గాలకు విస్తరించింది. 1894లో మహిళా ఉద్యోగులకు కూడా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆ కాలంలో ఇది ప్రాధాన్యత కలిగిన పరిణామం. అలా పోస్టాఫీసు ప్రయాణంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఉత్తరం నుంచి పొదుపు.. పొదుపు నుంచి బీమా వరకూ వచ్చాయి.

గ్రామీణ భారతం కోసం.. ఆర్‌పీఎల్‌ఐ

దేశంలోని గ్రామీణ ప్రజలకు జీవిత బీమా రక్షణను విస్తరించాలనే ఉద్దేశంతో 1995 మార్చి 24న రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గ్రామాల వరకూ విస్తరించిన పోస్టాఫీసు నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని బీమా సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆర్‌పీఎల్‌ఐలో గ్రామ సురక్ష, గ్రామ సంతోష్‌, గ్రామ సువిధ, గ్రామ సుమంగళ్‌, గ్రామ ప్రియ, బాల జీవన్‌ బీమా వంటి వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

ఉత్తరాల నుంచి స్పీడ్‌ పోస్ట్‌ వరకు

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ తపాలా సేవల్లోనూ మార్పులు వచ్చాయి. 1986లో స్పీడ్‌ పోస్ట్‌ ప్రారంభమైంది. వేగవంతమైన పార్శిల్‌, ఎక్స్‌ప్రెస్‌ సేవలు విస్తరించాయి. కంప్యూటరీకరణతో కార్యాలయ నిర్వహణలో మార్పులు వచ్చాయి. తరువాత కోర్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు పోస్టుకార్డు కోసం తపాలా పెట్టె వెతికిన ప్రజలు, ఇప్పుడు మొబైల్‌ ద్వారా ఖాతా వివరాలను పరిశీలించే స్థాయికి చేరుకున్నారు. సాంకేతికత మారింది. సేవల రూపం మారింది. కానీ ప్రజలకు చేరువగా ఉండే పోస్టాఫీసు పాత్ర మాత్రం కొనసాగింది.

నేటి పోస్టాఫీసు.. ఆర్థిక సేవల కేంద్రం

భారత తపాలా శాఖ దేశంలో అత్యంత విస్తృతమైన సేవా నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 1,64,999 పోస్టాఫీసులు ఉన్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటిలో భారీ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అందుకే గ్రామీణ భారతంలో పోస్టాఫీసు ఒక ఉత్తరాల కార్యాలయం మాత్రమే కాదు. పొదుపు, బీమా, బ్యాంకింగ్‌, ప్రభుత్వ సేవలకు ప్రజలకు చేరువైన కేంద్రంగా పనిచేస్తోంది.

భవిష్యత్తుకు భరోసాగా..

​ పోస్టాఫీసులో ప్రస్తుతం అమల్లో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు వేర్వేరు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి.

​పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా : రోజువారీ పొదుపు, డబ్బు జమ–ఉపసంహరణ వంటి అవసరాలకు ఉపయోగపడే ప్రాథమిక ఖాతా.


రికరింగ్‌ డిపాజిట్‌ : ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసుకునే విధానం. క్రమబద్ధమైన పొదుపు అలవాటు పెంచుకోవాలనుకునే కుటుంబాలకు ఉపయోగకరం.


టైమ్‌ డిపాజిట్‌ : నిర్ణీత కాలానికి ఒకేసారి డబ్బును డిపాజిట్‌ చేసే పథకం. ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాలపరిమితులతో ఖాతాలు తెరవొచ్చు.


నెలవారీ ఆదాయ పథకం : ఒకేసారి పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే వడ్డీని నెలవారీగా పొందాలనుకునే వారికి ఉపయోగపడే పథకం.


సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ : అర్హత కలిగిన వృద్ధులకు ప్రత్యేకమైన పొదుపు పథకం. పదవీ విరమణ అనంతరం పొదుపు, వడ్డీ ఆదాయం కోసం దీనిని పరిశీలించొచ్చు.


పీపీఎఫ్‌ : దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగపడే పొదుపు పథకం. దీని కాలపరిమితి 15 సంవత్సరాలు.


నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ : ఐదేళ్ల కాలపరిమితితో కూడిన పొదుపు పథకం. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మధ్యకాలిక పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది.


కిసాన్‌ వికాస్‌ పత్ర : నిర్ణీత కాలంలో పెట్టుబడి మొత్తం రెట్టింపు అయ్యే విధంగా రూపొందించిన పథకం.


సుకన్య సమృద్ధి ఖాతా : బాలికల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రూపొందించిన దీర్ఘకాలిక పొదుపు పథకం. పదేళ్లలోపు బాలిక పేరుతో సంరక్షకుడు ఖాతా ప్రారంభించవచ్చు. సంవత్సరానికి రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు.

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం త్రైమాసికంగా సమీక్షిస్తుంది. కాబట్టి పెట్టుబడి చేసే సమయంలో తాజా వడ్డీ రేటు, నిబంధనలను అధికారికంగా నిర్ధారించుకోవాలి.

postal .jpg

పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు

పిల్లల భవిష్యత్తు అంటే విద్య, ఉన్నత విద్య, వృత్తి, వివాహం వంటి అనేక అంశాలు గుర్తుకొస్తాయి. ఈ అవసరాల కోసం ముందుగానే పొదుపు చేయడం కుటుంబ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన భాగం. బాలికల కోసం సుకన్య సమృద్ధి ఖాతా ప్రత్యేకంగా ఉంది. దీర్ఘకాలికంగా పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. పోస్టల్‌ బీమా వ్యవస్థలో బాల జీవన్‌ బీమా వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే బీమా తీసుకునే ముందు వయోపరిమితి, ప్రీమియం, బీమా మొత్తం, మెచ్యూరిటీ, బోనస్‌, సరెండర్‌, రుణ సదుపాయం వంటి నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి.

పెద్దలకూ పొదుపుతో పాటు రక్షణ

ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే మొత్తం జీవితకాల అవసరాలకు సరిపడేలా ప్రణాళిక చేసుకోవడం అవసరం. వృద్ధులకు ప్రత్యేకంగా ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, నెలవారీ ఆదాయ పథకం వంటి వాటిని తమ ఆర్థిక పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా పరిశీలించొచ్చు. అయితే మొత్తం డబ్బును ఒకే పథకంలో పెట్టకుండా.. అత్యవసర అవసరాలకు కొంత మొత్తం అందుబాటులో ఉంచుకోవడం, దీర్ఘకాలిక అవసరాలకు తగిన పథకాలను ఎంచుకోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

1884 నుంచి నేటి వరకు పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భారతదేశంలోని పురాతన జీవిత బీమా వ్యవస్థల్లో ఒకటి. ప్రస్తుతం అర్హత కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారా మిలటరీ సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు తదితర వర్గాలకు పీఎల్‌ఐ అందుబాటులో ఉంది.

పీఎల్‌ఐలో ప్రధానంగా.. సురక్ష – హోల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌, సంతోష్‌ – ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌, సువిధ – కన్వర్టిబుల్‌ హోల్‌ లైఫ్‌, సుమంగళ్‌ – యాంటిసిపేటెడ్‌ ఎండోమెంట్‌, యుగల్‌ సురక్ష – జాయింట్‌ లైఫ్‌, బాల జీవన్‌ బీమా – పిల్లల కోసం పాలసీలు ఉన్నాయి.

గ్రామీణులకు బీమా : ఆర్‌పీఎల్‌ఐ

గ్రామీణ ప్రాంతాల్లో బీమా సేవలను విస్తరించడంలో ఆర్‌పీఎల్‌ఐ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామ సురక్ష, గ్రామ సంతోష్‌, గ్రామ సువిధ, గ్రామ సుమంగళ్‌, గ్రామ ప్రియ, బాల జీవన్‌ బీమా వంటి పాలసీలు ఇందులో ఉన్నాయి. గ్రామాల్లోనే ఉన్న పోస్టాఫీసు ద్వారా బీమా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల బీమా అవగాహన విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతోంది. బీమా అంటే పెట్టుబడి కాదు.. కుటుంబానికి రక్షణ. బీమా పాలసీని కేవలం ‘ఎంత రాబడి వస్తుంది?’ అనే కోణంలో చూడకూడదు. కుటుంబానికి అవసరమైన బీమా రక్షణ ఎంత? ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించగలమా? పాలసీ కాలపరిమితి ఎంత? మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏమిటి? మరణ ప్రయోజనం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవాలి. బీమా ప్రధాన ఉద్దేశం ఆర్థిక రక్షణ. పొదుపు ప్రధాన ఉద్దేశం భవిష్యత్తు అవసరాల కోసం నిధిని సమకూర్చుకోవడం. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం ముఖ్యం.

పోస్టాఫీసులో అందుబాటులో ఉండే కొన్ని పొదుపు పథకాలు

పోస్టాఫీస్ పొదుపు ఖాతా, పునరావృత డిపాజిట్, కాలపరిమితి డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలు వివిధ అవసరాలకు ఉపయోగపడతాయి.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ (ఎస్‌సిఎస్‌ఎస్‌) : ఈ స్కీములో ఐదేళ్లకు రూ.1లక్ష‍ పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీతో కాలపరిమితి ముగిసిన తర్వాత రూ.1,41,000 వస్తుంది.


సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌ఎ) : అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు వచ్చాక పూర్తవుతుంది. ప్రతినెలా రూ.1000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీతో రూ.5,54,612 వస్తుంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి) : ఐదేళ్ల కాలపరిమితికి రూ.1లక్ష‍ పెట్టుబడి పెడితే 7.7 శాతం వడ్డీతో రూ.1,44,903 వస్తుంది.


కిసాన్‌ వికాస పత్రం (కెవిపి) : రూ.లక్ష‍ పెట్టుబడి పెడితే 9 సంవత్సరాల ఏడునెలలకు (15 నెలలు) 7.5 శాతం వడ్డీతో రూ.2 లక్ష‍లు వస్తుంది.


నెలవారీ ఆదాయ పథకం(మన్త్లీ ఇన్‌కమ్‌ స్కీం-ఎంఎస్‌) : 7.4 శాతం వడ్డీతో ఐదేళ్లకు రూ.లక్ష‍ పెట్టుబడి పెడితే రూ.1.37 లక్ష‍లు వస్తుంది.


టర్మ్‌ డిపాజిట్‌ : ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీతో రూ.లక్ష‍కు రూ.1,38,568, మూడేళ్లకైతే 7.1 శాతం వడ్డీతో రూ. లక్ష‍కు రూ.1,21,873 వస్తుంది. రెండేళ్లకైతే 7 శాతం వడ్డీతో రూ.లక్ష‍కు రూ.1,14,372, ఏడాదికైతే 6.9 శాతం వడ్డీతో రూ.లక్ష‍కు రూ.1,07,081 వస్తుంది.


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిపిఎఫ్‌) : 15 ఏళ్ల కాలపరిమితికి 7.1 శాతం వడ్డీతో నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తే రూ.3,15,572 వస్తుంది.


రికరిండ్‌ డిపాజిట్‌ (ఆర్‌డి) : 6.7 శాతం వడ్డీతో ఐదేళ్లకు ప్రతినెలా రూ.100 చొప్పున చెల్లిస్తే రూ.7,136 వస్తుంది.


సేవింగ్‌ బ్యాంక్‌ (ఎస్‌బి) : ఈ ఖాతాలో నిల్వవుంచిన నగదు మొత్తాలకు నాలుగుశాతం వడ్డీ జమవుతుంది.

(పైన సూచించిన వడ్డీ మొత్తాలు ఈ ఏడాది జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ మాత్రమే వర్తిస్తాయి) ఖాతాదారులు ఇతరత్రా ఎలాంటి సంప్రదింపులు జరపాలన్నా టోల్‌ ఫ్రీ నంబరు 1800-266-6868 ద్వారా సంప్రదించొచ్చు.

చిన్న మొత్తాల పొదుపు వల్ల ప్రధాన ప్రయోజనాలు

  • పొదుపు అలవాటు పెరుగుతుంది: రోజువారీ లేదా నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని పక్కన పెట్టే అలవాటు ఏర్పడుతుంది.

  • అత్యవసర సమయాల్లో ఉపయోగం: అనారోగ్యం, విద్య, వివాహం, ఇంటి అవసరాలు వంటి సందర్భాల్లో పొదుపు చేసిన డబ్బు తోడ్పడుతుంది.

  • పిల్లల భవిష్యత్తుకు భరోసా: పిల్లల చదువు, ఉన్నత విద్య, ఇతర భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే పొదుపు చేయవచ్చు.

  • చిన్న ఆదాయ వర్గాలకు అనుకూలం: అధిక ఆదాయం లేని కుటుంబాలు కూడా తమకు సాధ్యమైన మొత్తంతో పొదుపు ప్రారంభించవచ్చు.

  • ప్రమాదాన్ని తగ్గించే అవకాశం: ప్రభుత్వం నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా బ్యాంకింగ్‌కు దూరంగా ఉన్నవారికి కూడా పొదుపు సౌకర్యం అందుతుంది.

  • వృద్ధాప్యానికి ఆర్థిక ఆధారం: ఉద్యోగ విరమణ లేదా ఆదాయం తగ్గిన సమయంలో ఉపయోగపడేలా దీర్ఘకాలిక పొదుపును ఏర్పాటు చేసుకోవచ్చు.

  • లక్ష్య ఆధారిత పొదుపు: ఇల్లు, విద్య, వివాహం, వ్యాపారం వంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం క్రమబద్ధంగా డబ్బు కూడబెట్టవచ్చు.

  • • గ్రామీణ ప్రజలకు అందుబాటు: బ్యాంకింగ్ సేవలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టాఫీసు పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి.

Pics Women Gathering At Post Offices With The Campaign That AP CM Will Deposit Rs 1500_4.jpg

డిజిటల్‌ పోస్టాఫీసు.. కొత్త రూపం

ఇప్పటి పోస్టాఫీసు కంప్యూటరీకరణ, కోర్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను ప్రజల గడపకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరిగింది. అంటే.. నాడు – “పోస్టుమ్యాన్‌ వచ్చాడా?”. నేడు – “ఖాతాలో లావాదేవీ జరిగిందా?”. ఇది తపాలా వ్యవస్థలో వచ్చిన సాంకేతిక పరిణామానికి ఒక చిన్న ఉదాహరణ.

సైబర్‌ యుగంలో.. కొత్త జాగ్రత్తలు

డిజిటల్‌ సేవలు పెరిగిన కొద్దీ సైబర్‌ మోసాల ప్రమాదం కూడా పెరిగింది. పోస్టాఫీసు పేరుతో వచ్చే నకిలీ ఫోన్‌కాల్స్‌, కేవైసీ పేరుతో పంపే సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ యాప్‌లు వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌ ఎవరికీ చెప్పకూడదు. పోస్టాఫీసు ఉద్యోగి పేరుతో ఎవరైనా ఫోన్‌ చేసి ఖాతా వివరాలు అడిగినా వెంటనే నమ్మకూడదు. అవసరమైతే సంబంధిత పోస్టాఫీసును నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలి. డిజిటల్‌ యుగంలో ఆర్థిక భద్రతకు రెండు వైపుల రక్షణ అవసరం. డబ్బును సరైన పథకంలో పెట్టడం ఒక వైపు.. ఆ డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని భద్రంగా ఉంచడం మరో వైపు.

పెట్టుబడి ముందు..

పోస్టాఫీసు పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేటు ఎంత? కాలపరిమితి ఎంత? కనీస–గరిష్ఠ పెట్టుబడి ఎంత? ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉందా? పన్ను నిబంధనలు ఏమిటి? మెచ్యూరిటీ మొత్తం ఎలా లెక్కిస్తారు? నామినీని నమోదు చేశామా? ఖాతాకు మొబైల్‌ నంబర్‌ అనుసంధానించామా? డిజిటల్‌ లావాదేవీల భద్రత ఎలా ఉంది? వీటికి సమాధానాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

నమ్మకమైన వ్యవస్థ.. అప్రమత్తమైన ఖాతాదారు

ప్రభుత్వ ఆధారిత పొదుపు పథకాలు ఉన్నప్పటికీ ప్రతి పథకానికి వేర్వేరు నియమాలు ఉంటాయి. ఒక పథకానికి వర్తించే నిబంధన మరో పథకానికి వర్తించకపోవచ్చు. అందుకే పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టే ముందు అధికారిక సమాచారం తీసుకోవాలి. వడ్డీ రేట్లు, పథకాల నిబంధనలు కాలానుగుణంగా మారవచ్చని గుర్తుంచుకోవాలి. నమ్మకం ఉండాలి.. కానీ వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం ఉండాలి.

రేపటి పోస్టాఫీసు.. మరింత డిజిటల్‌

రాబోయే రోజుల్లో పోస్టాఫీసు సేవలు మరింత సాంకేతికత ఆధారంగా మారనున్నాయి. మెయిల్‌, పార్శిల్‌ సేవలతో పాటు ఆర్థిక సేవలు, బీమా, డిజిటల్‌ చెల్లింపులు, పౌర సేవలు మరింత సమన్వయంతో అందించే దిశగా తపాలా వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. గ్రామీణ భారతంలో చివరి మైలు వరకు సేవలను అందించే సామర్థ్యం పోస్టాఫీసుకు ఉంది. అందువల్ల భవిష్యత్తులో డిజిటల్‌ సేవలు పెరిగినా, ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండే కేంద్రంగా పోస్టాఫీసు పాత్ర కొనసాగొచ్చు.

గ్రామీణ ప్రజల నేస్తం...

గ్రామీణ భారతంలో పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, పార్సిళ్లు అందించే కేంద్రం మాత్రమే కాదు.. ప్రజల ఆర్థిక భద్రతకు అండగా నిలిచే విశ్వసనీయ వ్యవస్థ. మారుమూల గ్రామాల్లో బ్యాంకింగ్‌ సదుపాయాలు పరిమితంగా ఉన్న రోజుల్లో పోస్టాఫీసులే ప్రజలకు పొదుపు అలవాటును నేర్పాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు పోస్టాఫీసును తమ సొంత సంస్థగానే భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమై సేవలందించడం పోస్టాఫీసుల ప్రత్యేకత. ఉత్తరాల నుంచి మనియార్డర్ల వరకు, పొదుపు ఖాతాల నుంచి బీమా సేవల వరకు పోస్టాఫీసు ప్రయాణం విస్తరించింది. డిజిటల్‌ సాంకేతికతను అందిపుచ్చుకుని ఆధార్‌, నగదు బదిలీ, డిజిటల్‌ చెల్లింపులు వంటి సేవలను కూడా ప్రజలకు చేరువ చేస్తోంది. అందుకే గ్రామీణ ప్రజల జీవితాల్లో పోస్టాఫీసు ఒక సేవా కేంద్రం మాత్రమే కాదు.. నమ్మకమైన ఆర్థిక నేస్తంగా కొనసాగుతోంది.

నేడు ఆర్థిక, డిజిటల్‌, పౌర సేవల సమ్మేళనం.. ఇది కేవలం ఒక సంస్థ పరిణామ చరిత్ర కాదు. భారత సమాజం మారుతున్న జీవన విధానానికి ఇది ఒక అద్దం. ఉత్తరాలు మోసిన చేతులు.. ఇప్పుడు భవిష్యత్తు పొదుపునూ మోస్తున్నాయి. తపాలా పెట్టె పక్కన నిలిచిన పోస్టాఫీసు.. ఇప్పుడు కుటుంబ ఆర్థిక ప్రణాళికలోనూ భాగమవుతోంది. కాలం మారినా.. ప్రజలకు చేరువగా ఉండే పోస్టాఫీసు బంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. నిన్నటి ఉత్తరం నుంచి నేటి డిజిటల్‌ ఆర్థిక భరోసా వరకు.. ఇదే భారత తపాలా ప్రయాణం.

ఈ ఏడాది థీమ్.. ఒకే పోస్టల్ నెట్‌వర్క్, అనంతమైన అవకాశాలు

​"ప్రపంచ పోస్టల్ దినోత్సవం: ఒకే పోస్టల్ నెట్‌వర్క్, అనంతమైన అవకాశాలు (World Post Day: One postal network, infinite possibilities)" ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డిజిటల్ యుగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోస్టల్ వ్యవస్థ ప్రజలను, వ్యాపారాలను ఎలా అనుసంధానిస్తుందో, ఎలాంటి అనంతమైన అవకాశాలను అందిస్తుందో తెలియజేయడానికి ఈ థీమ్‌ను నిర్ణయించారు.

* ప్రపంచ పోస్టల్ దినోత్సవం యొక్క చరిత్ర ఈ రోజున నిర్వహించే కార్యక్రమాలు మీకు ఏ వివరాలు కావాలో తెలియజేయండి!

srinivas బాణావత్_(2).jpg

బాణావత్‌ శ్రీనివాసరావు

పోస్టల్‌ సూపరింటెండెంట్‌, మచిలీపట్నం డివిజన్‌, కృష్ణాజిల్లా.

84658 43961



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్