సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఐ ఆధారిత పన్నుల నిర్వహణలో ఏపీ అగ్రగామి

2 గంటల క్రితం

gst
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 09:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జిఎస్టి కౌన్సిల్‌ అదనపు కార్యదర్శి పంకజ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పన్నుల నిర్వహణలో కృత్రిమ మేధస్సు, డేటా ఆధారిత విశ్లేషణలను సమర్థంగా వినియోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని జిఎస్టి కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ అదనపు కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ సింగ్‌ ప్రశంసించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఆధారిత పన్నుల నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేసేందుకు జిఎస్టి కౌన్సిల్‌ ప్రతినిధి బృందం విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ అదనపు కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ సింగ్‌, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రా నేతృత్వంలోని బృందానికి పన్నుల నిర్వహణలో ఏఐని వినియోగిస్తున్న విధానాన్ని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్‌ బాబు.ఎ వివరించారు. రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, ఆదాయ పన్ను, వృత్తి పన్ను, పన్ను బకాయిలు, ఆడిట్లు, తనిఖీలు, పరిశీలన తదితర విభాగాల్లో ఏఐ ఆధారిత డ్యాష్‌బోర్డులను పనితీరు జిఎస్టి కౌన్సిల్‌ బృందం ముందు ప్రదర్శించారు. ఈ-వే బిల్‌ డేటా ఆధారంగా ఎస్‌జిఎస్టి నగదు చెల్లింపులు, ఐజిఎస్టి సెటిల్‌మెంట్‌ను అంచనా వేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పర్యవేక్షించేందుకు ఈ డ్యాష్‌బోర్డులు ఉపయోగపడుతున్నాయని అధికారులు వివరించారు. జిఎస్టి డేటాను స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి ప్రధాన సూచికగా వినియోగిస్తున్న విధానాన్ని, తక్షణ అంచనాల కోసం అనుసరిస్తున్న పద్ధతిని కూడా జిఎస్టి కౌన్సిల్‌ బృందానికి వివరించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ఏఐ ఏజెంట్‌ ద్వారా నివేదికలు, డ్యాష్‌బోర్డులు రూపొందిస్తున్న తీరును అధికారులు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. వివిధ రంగాలకు సంబంధించిన అధ్యయనాలు, సమాచారాన్ని సమీకరించి ఏఐ ఆధారిత నాలెడ్జ్‌ హబ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రధాన కమిషనర్‌ తెలిపారు. గతంలో మాదిరిగా కేవలం పన్ను పరిశీలనకే పరిమితం కాకుండా, ఆడిట్‌, కేసుల ఎంపిక, అవకతవకల గుర్తింపు నుంచి నోటీసుల జారీ, పన్ను చెల్లింపుదారుల స్పందనల పరిశీలన, తుది నిర్ణయం వరకు మొత్తం ప్రక్రియను ఏఐ ఆధారితంగా మార్చుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రిటర్నుల పరిశీలన, ఆడిట్‌, తనిఖీ ప్రక్రియలను జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్