సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు

1 గంట క్రితం

godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వచ్చే ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 238 ఘాట్‌ పనులకు రూ.210.06 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న ఘాట్ల అభివృద్ధితో పాటు అవసరమైన చోట్ల కొత్త ఘాట్ల నిర్మాణం, ఇతర అనుబంధ పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు జల వనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు నదీ స్నానాలకు తరలిరానున్న నేపథ్యంలో ఘాట్లను అభివృద్ధి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 238 ఘాట్‌ పనులతో పాటు ఇతర అనుబంధ పనులకు రూ.250 కోట్లతో పరిపాలనా అనుమతి కోరుతూ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఇరిగేషన్‌) ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.210.06 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇసుకకు సంబంధించిన వ్యయం, రవాణా ఛార్జీలను జిల్లా స్థాయి కమిటీ లేదా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లెక్కించాలని, చిన్న ఖనిజాలకు సంబంధించిన సీనరేజ్‌ ఛార్జీలు, డీఎంఎఫ్‌, మెరిట్‌ రుసుములను ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రతిపాదిత పనులకు వివరణాత్మక అంచనాలు సిద్ధం చేయడంతో పాటు ఒకే ప్రాంతంలో పనుల పునరావృతం లేకుండా, పొడవులో ఎలాంటి ఓవర్‌ల్యాప్‌ లేదా డూప్లికేషన్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్