- నూజిళ్లపల్లి గ్రామ పర్యటనలో వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి- పంగులూరు (ప్రకాశం జిల్లా) : ఈ దేశం కోసం రాజ్యాంగాన్ని రచించి, దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును నిర్దేశించిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిబంధనలు అవసరం లేదని, ఎక్కడైనా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించుకునే అవకాశం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేదలంతా ఐక్యంగా నిలబడి విగ్రహ ప్రతిష్ట కోసం పోరాడాలని కోరారు. పోరాటం ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదో తేదీన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకునే క్రమంలో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి వీలులేదంటూ పోలీసు, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని పంగులూరు తహశీల్దార్ కార్యాలయానికి తరలించిన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పటినుండి దళితులు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో వి.శ్రీనివాసరావు ఆ కాలనీని శనివారం సందర్శించారు. అక్కడ ఉన్న చర్చిలో దళితులతో ఆయన మాట్లాడారు. దళిత కాలనీ రోడ్డు ప్రారంభంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఆర్చిని ఏర్పాటు చేసుకోవాలనేది దళితుల న్యాయమైన కోరికని అన్నారు. ‘అధికారం ఎవరి చేతిలో ఉంది. దాని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు. అధికారులు ఎవరి మాట వింటున్నారు’ అనేది మనకి ఈ పాటికే అర్థమై ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయని, వీటి పరిష్కారానికి దేశవ్యాప్తంగా దళిత సోషణ్ ముక్తి మంచ్ అనే సంఘాన్ని నడుపుతున్నామని, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇక్కడ ఇలాంటి సమస్యలపై పోరాడుతోందని వివరించారు. పోరాటం ద్వారానే అనేక సమస్యలను రాష్ట్రంలోనూ, దేశంలోనూ పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. ‘కలెక్టర్ అయినా, ఆర్‌డిఒ అయినా మీ గుర్తింపును గుర్తించక తప్పదు’ అని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశం ప్రభుత్వ స్థలమని, ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో ఏర్పాటు చేయాలనుకోలేదని వివరించారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర మేలుకొని ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామగ్రామానా, పట్టణాల్లో కూడా అనేక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, అనేక ఆర్చీలు కూడా ఉన్నాయన్నారు. నూజిళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, ఆర్చిని ఏర్పాటు చేసుకునేందుకు పెత్తందారులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు పెట్టుకున్న ఫ్లెక్సీని చించి వేయడం ఏమిటి? దీనికి జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒ, పోలీసులు ఎలా సహించారు? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పెత్తందారులు వెనుక ఉండి చాప కింద నీరులా కథ నడుపుతున్నారన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించింది ఓ దళిత యువకుడు అని, ఆ ఉద్యమానికి భయపడి ప్రధానమంత్రి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. ప్రజల ఐక్యతకు ఉన్న శక్తి అది అని శ్రీనివాసరావు వివరించారు. గ్రామాల్లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎన్‌టి.రామారావు విగ్రహాలకు పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఎన్ని రోజులకు ఇచ్చారు? అని శ్రీనివాసరావు నిలదీశారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ మహిళా హక్కుల కోసం, భూ హక్కుల కోసం, రైతాంగ హక్కుల కోసం పోరాడారని, ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతుల కోసం ఎదురుచూడటం ఏమిటని ప్రశ్నించారు. దళితవాడల్లో సమస్యలు పరిష్కారానికి ఈ నెల 24న ఒంగోలులో జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమంలో దళితులంతా పాల్గొనాలని కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఇక్కడున్న సమస్యను పరిష్కరించడంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా నాటకాలు ఆడుతున్నారని, భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు చేయడానికి వీరికి ఆటంకం ఏమిటని ప్రశ్నించారు. ఇది దళితుల ఆత్మగౌరవ సమస్యని అన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశాన్ని వి.శ్రీనివాసరావు పరిశీలించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ మాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, ఐద్వా నాయకులు కంకణాల రమాదేవి, కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.రఘురాం, రైతు సంఘం జిల్లా నాయకులు తలుపనేని రామారావు తదితరులు ప్రసంగించారు.







కామెంట్‌లు (0)