ప్రజాశక్తి-టెక్కలి రూరల్(శ్రీకాకుళం) : అదానికి లాభాలు గ్యారెంటీ, జిల్లా ప్రజలకు కాలుష్యంతో రోగాలు గ్యారెంటీ చేయడమే అభివృద్ధా ? అని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కోనారి మోహనరావు ప్రశ్నించారు. గురువారం సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ విశాఖపట్నం పోర్టులో కాలుష్య కారకాలను కార్గో హ్యాండ్లింగ్ మూలపేట పోర్టుకు తరలిస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని పరిశ్రమల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ప్రకటన చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మూలపేట అదాని పోర్టుకు లాభాలను గ్యారెంటీ చేయడం కోసం కూటమి కాలుష్యకారక రవాణాను మూలపేట పోర్టుకు తరలిస్తుందని విమర్శించారు. ఐరన్ ఓరు, బొగ్గు మొదలగు ధూళి దుమ్ముతో ఉండే సరుకులను ఇక్కడి నుండి రవాణా చేయడం వల్ల పలాస నుండి టెక్కలి వరకు విపరీతంగా వాయు కాలుష్యము వలన జిల్లా ప్రజలు మంచిగాలి కూడా పీల్చికోలేని పరిస్థితి ఏర్పడుతుందని తద్వారా ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వ్యాపిస్తాయని వారన్నారు. మరొకవైపున ధూళి, దుమ్ముతో పంటలు సర్వనాశనం అవుతాయని వారు అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాన్ని రేర్ ఎర్త్ మినరల్ కోసం సముద్ర తీర ప్రాంతాన్ని ఆదానికి కట్టబెట్టిందని విమర్శించారు. దీనివలన పచ్చని తీర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాకు పర్యావరణపరంగా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని మరొకవైపున కాలుష్య కారకాలతో జిల్లా డంపింగ్ యార్డ్ గా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ''ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి'' అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదాని మూలపేట పోర్టుకి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చడానికి బిజెపి టిడిపి కూటమి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు, మూలపేట పోర్ట్ నుండి సహజమైన సరుకులు రవాణా చేయాలని డిమాండ్ చేశారు, మూలపేట పోర్టును ప్రభుత్వ రంగంలోనే నడపాలని, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న హామీని అమలు చేయాలని, కాలుష్యకారక సరుకులను డంపింగ్ చేయడం ఆపాలని, తీర ప్రాంతాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.
అదానికి లాభాలు.. ప్రజలకు రోగాలా..?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 10:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)