ఎస్‌సి కమిషన్‌కు ప్రజాసంఘాల విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో మాజీ సర్పంచ్ గరికపాటి సురేష్‌పై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన సంఘటనలో ఫిర్యాదు చేసిన 11 రోజుల తర్వాత కేసు నమోదు చేయడమే కాకుండా, నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎపి ఎస్ సి కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ కు మంగళవారం వినతిపత్రాన్ని అందించారు. అక్టోబర్ 1న దాడి జరిగితే, బాధితుడు అదే రోజు ఫిర్యాదు చేసినా పోలీసులు అక్టోబర్ 12న కేసు నమోదు చేశారని మాల్యాద్రి తెలిపారు. దాడి చేసిన వారిపై ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల సందర్భంగా ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడుతున్న సురేష్‌పై టిడిపి బుచ్చిరెడ్డిపాలెం మండల అధ్యక్షుడు బెజవాడ జగదీష్, ఆయన అనుచరులు దాడి చేసినట్లు బాధితులు తెలిపారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుల పేర్లను స్పష్టంగా నమోదు చేయకుండా ‘ఇతరులు’ అని పేర్కొనడం, నిందితులను అరెస్టు చేయకుండా రాజీకి ప్రయత్నిస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. బాధితులను బెదిరించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఛైర్మన్ డిఎస్ పికి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు, నిందితులను అరెస్టు చేయకపోతే మరోసారి కలవాలని బాధితులకు భరోసా ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నెల్లూరు జిల్లా కార్యదర్శి అలూరు తిరుపాల్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు డి రమాదేవి, కోశాధికారి కంకణాల ఆంజనేయులు, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ పూసపాటి వెంకటరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మళ్ల రామన్న, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎ అశోక్, బాధితులు గరికపాటి సురేష్, నారాయణ తదితరులు ఉన్నారు.







కామెంట్‌లు (0)