రాష్ట్ర సదస్సులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్రంలో మహిళలు, పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరిచి.. ఆశించిన ఫలితాలను వేగంగా సాధించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ‘ఆంధ్రప్రదేశ్‌లో పోషకాహార ఫలితాలను వేగవంతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ సేవల నాణ్యతను పెంచడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు అంగన్‌వాడీ సేవలను విస్తరించాలని, పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, బలహీన వర్గాలకు సేవలను చేరువ చేయాలని సూచించారు. కిశోర బాలికల్లో రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన ఆహారం, రుతుక్రమ ఆరోగ్యం, బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పోషకాహార కార్యక్రమాల్లో సేవలు పొందిన వారి సంఖ్యతోపాటు ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను కూడా అంచనా వేయాలని సూచించారు. ఇందుకు డేటా వినియోగం, మెరుగైన పర్యవేక్షణ, సిబ్బంది సామస్స్త్రర్థ్యాభివృద్ధి అవసరమన్నారు. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా ‘మార్గదర్శి – ఆంధ్రప్రదేశ్ న్యూట్రిషన్ అడ్వైజరీ గ్రూప్’ను ఏర్పాటు చేసి నిపుణుల సలహాలతో పోషకాహార విధానాలను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. సదస్సులో వెలువడే సూచనలను వచ్చే నెల ఒకటి నుంచి అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్గదర్శి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేఘాలయ అదనపు ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, తమిళనాడు ఐసిడిఎస్ మిషన్ డైరెక్టర్ కె శాంతి, వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ కన్సల్టెంట్ రూపాల్ దళాల్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఐసిడిఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డ్వాక్రా, మెప్మా మహిళలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)