కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 176/4
నేటితో ముగియనున్న రంజీమ్యాచ్
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ (విజయవాడ) : ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అంతకుముందు ఆంధ్ర జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 418 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బ్యాటర్లలో రాహుల్ 119 పరుగులతో సెంచరీ సాధించగా, రేవంత్ రెడ్డి 97 పరుగులు, షేక్ రషీద్ 54 పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో శిఖర్ శెట్టి ఆరు వికెట్లు పడగొట్టగా, మాధవ్ బజాజ్, రితేష్ బత్కల్ చెరో రెండు వికెట్లు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు తరఫున కరుణ్ నాయర్ 130 బంతుల్లో 81 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మన్వంత్ కుమార్ 110 బంతుల్లో 44 పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా, లలిత్ మోహన్ ఒక వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులకే వెనుదిరిగిన రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వికెట్ కోల్పోయారు. రాహుల్ బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ఆయన ప్రదర్శన నిరాశ మిగిల్చింది. మ్యాచ్‌కు రేపు చివరి రోజు కావడంతో ఇరు జట్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి ఉండటంతో చివరి రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగనుంది.








కామెంట్‌లు (0)