రైతులకు ఊరట
భూసేకరణపై యథాతథ స్థితి పాటించాలని కోర్టు ఆదేశం
ప్రభుత్వంపై తొలి విజయంగా భావిస్తున్న బాధిత రైతులు
ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో/కందుకూరు : ఇండోసోల్ కంపెనీకి అడ్డగోలుగా భూములు సేకరించి ఇస్తున్న ప్రభుత్వ చర్యలకు తాత్కాలికంగా హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో రైతులకు ఊరట లభించింది. ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం కరేడు సమీపంలో సోలార్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూముల్లో పిటిషనర్లకు చెందిన వాటిపై తదుపరి విచారణ వరకూ యథాతథ స్థితిని పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి తొలివిజయమంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండోసోల్ సోలార్ కంపెనీకి ఇక్కడ భూములను సేకరించి ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు సిపిఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, రైతుసంఘాలు అండగా నిలిచాయి. రైతులు గతంలో జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునివ్వగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను పంపి రైతులు గ్రామం నుంచి బయటకు రాకుండా అడ్డుకుంది. నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినా రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఇండోసోల్ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఎన్నికల సమయంలో ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల కింద రూ.40 కోట్లు టిడిపి తీసుకోవడంతో కంపెనీకి ఏదో రకంగా భూములు అప్పగించాలనే ఆలోచనలోనే ముందుకు పోతోంది.
ఇప్పటికే 2,915 ఎకరాలు సేకరణ...
ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్రాజెక్టు పెట్టేందుకు సిద్ధమవ్వగా ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు ఈ కంపెనీకి రామాయపట్నం పోర్టు వద్ద భూములు ఇవ్వగా వీటిని రద్దు చేసి కరేడు వద్దకు మార్చారు. సుమారు 8,300 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కరేడు ప్రాంతంలోనే 4,530 ఎకరాలు గుర్తించారు. ఇవన్నీ ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు. వేరుశనగ, వరి, కూరగాయల పంటలు పండుతాయి. ఈ భూములను సేకరించేందుకు 2025 జూన్‌లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అభిప్రాయ సేకరణ సభ రసాభాసాగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అణచివేసే యత్నం చేసి, తర్వాత ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి రైతులను పార్టీలపరంగా విడదీశారు. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుక వచ్చారనే పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారు. మాగాణి, మెట్ట అనే తేడా లేకుండా ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం నెలరోజుల్లోనే ఇస్తామని అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రకటించారు. 4,530 ఎకరాలకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 2,912 ఎకరాలకు స్వచ్చందగా భూమి ఇస్తున్నారనే చర్చను ముందుకు తెచ్చారు. వారి పేరుతో 1,700 ఎకరాలకు నగదు కూడా చెల్లించి, వీటిని సేకరించినట్లుగా పేర్కొన్నారు.
బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు...
ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. బలవంతపు భూసేకరణ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కరేడు గ్రామానికి చెందిన 63 మంది రైతులు హైకోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి భూసేకరణలో జాప్యానికి నిరాకరించారు. భూసేకరణలో నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారే తప్ప నిలిపివేసే చర్యలు తీసుకోలేదు. దీంతో, ఈ తీర్పును సవాలు చేస్తూ 45 మంది రైతులు ధర్మాసనం ముందు అప్పీలు వేశారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ అదనపు వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేస్తూ అప్పటి వరకూ భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయమూర్తులు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చారు. దీంతో భూసేకరణకు తాత్కాలిక బ్రేకు పడింది.







కామెంట్‌లు (0)