రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలి
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీర్ల వ్యవస్థను కొనసాగించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తే రాష్ట్రంలోని వలంటీర్లంతా ఐక్యంగా ఉద్యమించి అసెంబ్లీని ముట్టడించాల్సి వస్తుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి హెచ్చరించారు. ఎంబివికె భవన్‌లో ఎపి గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర సదస్సును రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ నాయక్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి..గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లు, వారి కుటుంబాలున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రస్తుతం విధుల్లో లేని కాలానికి నిరుద్యోగ భృతిగా రూ.5 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వినోద్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. సింహాచలంలో డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, కర్నూలులో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించబోమని చెప్పారన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి డోల స్వప్న మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాటలు నమ్మి 2.60 లక్షల మంది వలంటీర్లు మోసపోయారన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తే.. కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లను తొలగించే బహుమతిని ఇచ్చారని విమర్శించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదెల ప్రసాదరావు, పి మక్బుల్ బాషా, సహాయ కార్యదర్శి బేతపూడి అశోక్, పి దుర్గపుష్పలక్ష్మి, కోశాధికారి అయినాడ గౌరినాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలముల మహేష్, వెంకటసుబ్బయ్య, గెమ్మెలి సత్యారావు, ఉమ్మిడిశెట్టి కల్యాణ్ చక్రవర్తి, కె యామిని, ఎ లాజర్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)