మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజోరు వానలోనూ పాదయాత్ర

36 నిమిషాల క్రితం

padayatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : సాగు హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ ఆధ్వర్యాన ఎచ్చెర్ల మండలం చిలకపాలెం రైతులు రెండు రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. వాయుగుండం ప్రభావంతో ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో రైతులు, మహిళలు, యువకులు ముందుకు సాగారు. సాగు హక్కు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చే వరకూ పోరాడతామంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం కూడలి నుంచి బైపాస్, పాలిటెక్నిక్ కళాశాల మీదుగా పిఎన్ కాలనీ కూడలి వద్ద శ్రీకాకుళం నగరంలోని ప్రవేశించారు. అక్కడ నుంచి ఏడు రోడ్ల కూడలి, జిటి రోడ్ మీదుగా సూర్యమహల్ కూడలి, పెద్దబరాటం వీధి, పాతబస్టాండ్ నుంచి జిల్లాపరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. జెడ్పీలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ లేకపోవడంతో వర్షంలో తడుస్తూనే అక్కడ కొద్దిసేపు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించినా కలెక్టరేట్‌లోకి వెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను వివరించారు. నారాయణపురం భూ విషయం తనకు తెలుసునని, అది ఇనాం భూమి అని.. తాను సెటిల్ చేస్తానని హామీనిచ్చారు. కోర్టులో కేసు ఉందని జెసి చెప్పడంతో, కేసు ఉన్నా సాగుదారులుగా రైతులను నమోదు చేయడానికి అభ్యంతరం ఉండదని, వెంటనే నమోదు చేసి ప్రభుత్వ ప్రయోజనాలు రైతులకు దక్కేలా చూడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ నాయకులు టి.నందోడు కోరారు. తప్పకుండా న్యాయం చేస్తానని జెసి భరోసానిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎన్.వి రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, పోరాట కమిటీ నాయకులు కోరాడ అప్పన్న, పుట్టా. కవిలేశ్వరరావు, పుట్టా మల్లేశ్వరరావు, జరజాపు సీతారాం తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్