ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో వెలిగొండ నిర్వాసితులకు అండగా నిలబడ్డ సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి సోమయ్యపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల తీరును ఖండించాల్సిందిగా ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాలని, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన యువతకు ఇస్తామన్న రూ.2 లక్షలు ఇవ్వాలని కోరుతూ మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నిర్వాసితులకు సంఘీభావంగా ఉద్యమంలో పాల్గొన్న సోమయ్యపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్నారు. గాయాలపాలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, సోమయ్యకు మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించకుండా దౌర్జన్యంతో ప్రజా ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)